T20 World Cup: T20 ప్రపంచ కప్ 2026 గ్రూప్– Bలో భాగంగా కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంక వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్ జరుగుతుంది. శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న లంక జట్టు.. 54 పరుగుల వద్ద బ్లెస్సింగ్ ముజారబానీ బౌలింగ్ లో షార్ట్ ఫైన్ లెగ్ లో కుశాల్ పెరీరా భారీ షాట్ ఆడి అవుట్ అయ్యాడు. పెరీరా 14 బంతుల్లో 22 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాగా.. ఆ తర్వాత కుశాల్ మెండిస్ తో కలిసి పాతుమ్ నిస్సాంక జింబాబ్వే బౌలర్లపై బ్యాట్ ఝళిపించాడు. 35 బంతుల్లోనే 54 పరుగులు చేశాడు.
వన్ డౌన్ లో బ్యాటింగ్ కి వచ్చిన కుశాల్ మెండిస్ బ్యాటింగ్ లో తడబడ్డాడు. ర్యాన్ బర్ల్ వేసిన అద్భుతమైన బాల్ కి మెండిస్ క్రీజు నుంచి బయటకు వచ్చి ఆడే ప్రయత్నం చేయగా.. జింబాబ్వే కీపర్ తడివానాషే మరుమాని స్టంప్ అవుట్ చేశాడు. మెండిస్ ఔట్ అయినా కాసేపటికే గ్రేమ్ క్రీమర్ బౌలింగ్ లో రివర్స్ స్వీప్ ఆడబోయి టోనీ మున్యోంగాకి క్యాచ్ ఇచ్చి పాతుమ్ నిస్సాంక (62) కూడా పెవిలియన్ చేరాడు. అనంతరం మైదానంలోకి వచ్చిన కమిందు మెండిస్ (7) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. శ్రీలంక స్కోర్ 123 పరుగుల వద్ద గ్రేమ్ క్రీమర్ బౌలింగ్ లో అతడికి క్యాచ్ ఇచ్చి కమిందు మెండిస్ ఔట్ అయిన తర్వాత స్టేడియంలోకి వచ్చిన శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకా సైతం నిలవలేకపోయాడు. ముజారబానీ బౌలింగ్ లో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.
మరోవైపు, శ్రీలంక జట్టు వరుసగా వికెట్లను కోల్పోవడంతో క్రీజులోకి వచ్చిన పవన్ రత్నాయకే చివర్లో చెలరేగిపోయాడు. అర్థ శతకం చేసే దిశగా సాగిన పవన్ (44)ని బ్రాడ్ ఎవాన్స్ ఔట్ చేశాడు. అనంతరం స్టేడియంలోకి ఇలా వచ్చి దుషన్ హేమంత (0) వెళ్లిపోయాడు. చివర్లో దునిత్ వెల్లలాగే 20వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టడంతో శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగలిగింది. దీంతో జింబాబ్వే బౌలర్లలో గ్రేమ్ క్రీమర్, బ్లెస్సింగ్ ముజారబానీ, బ్రాడ్ ఎవాన్స్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, ర్యాన్ బర్ల్ వికెట్ తీసుకున్నారు.
