The Kerala Story 2: కొత్త వివాదంలో 'ది కేరళ స్టోరీ 2'.. బీఫ్ సీన్‌పై నెటిజన్లు సీరియస్!

The Kerala Story 2: కొత్త వివాదంలో 'ది కేరళ స్టోరీ 2'.. బీఫ్ సీన్‌పై నెటిజన్లు సీరియస్!

గతేడాది విడుదలైన 'ది కేరళ స్టోరీ' దేశం వ్యాప్తంగా ఎలాంటి వివాదాలు, సంచలనాలు సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ వివాదం నుంచి కోలుకోకముందే ఇప్పుడు దాని సీక్వెల్ రాబోతోంది.  కామాఖ్య నారాయణ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది కేరళ స్టోరీ 2: గోస్ బియాండ్' టీజర్ విడుదలైన కొద్దిసేపటికే మళ్ళీ పాత గాయాలను రేపింది.  రాజకీయంగా, సామాజికంగా దుమారం రేపుతోంది. ముఖ్యంగా ఈ టీజర్‌లో చూపించిన ఒక 'బీఫ్' తినే దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికే దారితీసింది.

వివాదానికి కారణమైన ఆ ఒక్క సీన్!

ఈ టీజర్‌లో కథానాయికను బలవంతంగా బీఫ్ తినమని వేధించే సన్నివేశం ఒకటి ఉంది. సాధారణంగా ఇటువంటి సీన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తాయి, కానీ కేరళ నెటిజన్లు మాత్రం దీనికి చాలా విభిన్నంగా, వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. మలయాళీలకి బీఫ్, పొరోటా అంటే ఉండే ఇష్టమనేది జగమెరిగిన సత్యం. ఇదే అంశాన్ని వాడుకుంటూ నెటిజన్లు చిత్ర యూనిట్‌ను ట్రోల్ చేస్తున్నారు. "పొరోటా లేకుండా బీఫ్ ఎలా తింటాం ముత్తే (బంగారం)?" అని కొందరు ప్రశ్నిస్తుంటే.. "నన్ను ఎవరైనా బలవంతంగా బీఫ్ తినమంటే.. అందులో కొబ్బరి ముక్కలు ఉన్నాయా లేదా? అని అడుగుతాను" అంటూ మరికొందరు జోకులు పేలుస్తున్నారు. కేరళలో బీఫ్ రేట్లు ఆకాశాన్ని తాకుతున్నాయని, ఇలా బలవంతంగా పెట్టేంత సీన్ లేదని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు.

 

రాజకీయ సెగలు

సినిమాపై కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ చిత్రంపై మండిపడ్డారు. రాష్ట్రంలోని మతసామరస్యాన్ని దెబ్బతీసేందుకు, కేరళ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇటువంటి చిత్రాలను ప్లాన్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇది సినిమా కాదని, కేరళ ప్రతిష్టను ప్రపంచం ముందు దిగజార్చడానికి పన్నిన ఒక ‘విద్వేషపూరిత ప్రోపగాండా’ అని అభివర్ణించారు. కేరళను ఒక నెగటివ్ కోణంలో చూపిస్తూ 'కేరళ' అనే పేరును బ్రాండింగ్‌గా వాడుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.  

అవార్డులు vs వివాదాలు

'ది కేరళ స్టోరీ' మొదటి భాగం 71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగాల్లో అవార్డులు గెలుచుకున్నప్పటికీ.. దానిపై వచ్చిన ఆరోపణలు మాత్రం తగ్గలేదు. ఇప్పుడు రెండో భాగం 'గోస్ బియాండ్'  అనే ట్యాగ్‌లైన్‌తో వస్తోంది. అంటే మొదటి భాగంలో చూపించిన దానికంటే మరేదో తీవ్రమైన విషయాన్ని ఇందులో చర్చించబోతున్నారని స్పష్టమవుతోంది.

అయితే సినిమా అనేది సమాజంలోని చేదు నిజాలను చూపించాలా? లేక ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ విద్వేషాన్ని పెంచాలా? అనే చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది. ఒకవైపు కేరళ ప్రజలు తమ ఫుడ్ కల్చర్‌తో ఈ వివాదాన్ని తేలికపాటి హాస్యంతో కొట్టిపారేస్తుంటే, రాజకీయ వర్గాలు మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. మరి ఈ సినిమా థియేటర్లలోకి వచ్చినప్పుడు ఇంకెన్ని సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువు అవుతుందో వేచి చూడాలి.