స్నాక్ బిజినెస్ క్లోజ్ చేసిన స్విగ్గీ.. 16 రోజుల్లో పుట్టి.. ఏడాదిలో మాయమైన యాప్..

స్నాక్ బిజినెస్ క్లోజ్ చేసిన స్విగ్గీ.. 16 రోజుల్లో పుట్టి.. ఏడాదిలో మాయమైన యాప్..

దేశంలోని ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ స్టార్టప్ కంపెనీ స్విగ్గీ తన వ్యాపార వ్యూహాల్లో కీలక మార్పులు చేస్తోంది. కేవలం 15 నిమిషాల్లో ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో ఏడాది క్రితం ప్రారంభించిన తన ప్రత్యేక యాప్ 'Snacc'ను మూసివేస్తున్నట్లు సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 19న కంపెనీ అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

ఎందుకు క్లోజ్ చేస్తున్నారు..?
స్నాక్ యాప్‌ను ప్రారంభించినప్పుడు యూజర్ల నుంచి మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్థికంగా ఈ మోడల్‌ను కొనసాగించడం సవాలుగా మారిందని స్విగ్గీ గుర్తించింది. ప్రతి ఆర్డర్‌పై లాభాలను ఆర్జించడంకష్టంగా ఉండటం, వ్యాపారాన్ని భారీ స్థాయిలో విస్తరించడానికి అవుతున్న ఖర్చు ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చెబుతోంది. భవిష్యత్తులో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఇన్నోవేషన్లపైనే దృష్టి సారించాలని స్విగ్గీ భావిస్తోంది.

స్పీడ్ డెలివరీ రేసులో వెనకడుగు..?
2025 జనవరిలో క్విక్ కామర్స్ రేసులో భాగంగా స్విగ్గీ ఈ 15 నిమిషాల డెలివరీ సేవలను ప్రారంభించింది. అప్పట్లో జెప్టో తన 'జెప్టో కేఫ్' ద్వారా.. జొమాటో బ్లింకిట్ 'బిస్ట్రో' ద్వారా 10-15 నిమిషాల డెలివరీ సెగ్మెంట్‌లో దూసుకుపోతున్నాయి. వీటికి పోటీగా స్విగ్గీ కేవలం 16 రోజుల్లోనే 'స్నాక్' యాప్‌ను డిజైన్ చేసి మార్కెట్లోకి తెచ్చింది. బెంగళూరు, గుర్గావ్ వంటి నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇది పనిచేసింది. ఆఫీస్ బ్రేక్ టైంలో కాఫీ లేదా స్నాక్స్ కోసం ఎదురుచూసే వారిని టార్గెట్ చేస్తూ ఈ సేవలు మొదలైన సంగతి తెలిసిందే. 

నష్టాల సెగ.. క్యూఐపీ నిధులు..
గత కొన్ని త్రైమాసికాలుగా స్విగ్గీ వరుస నష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో కంపెనీ ఇటీవల క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ ద్వారా భారీగా నిధులను సేకరించింది. ఇప్పుడు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి నష్టాల్లో ఉన్న వ్యాపార యూనిట్లను తగ్గించుకోవాలని మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అందుకే 'స్నాక్' వంటి ప్రయోగాలకు స్వస్తి పలికి.. ప్రధాన వ్యాపారమైన ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ యూనిట్ ఇన్‌స్టామార్ట్‌పై దృష్టి పెడుతోంది.

ఉద్యోగుల పరిస్థితి ఏంటి..?
'స్నాక్' మూసివేత వల్ల ప్రభావితమైన ఉద్యోగుల పట్ల స్విగ్గీ సానుకూలంగా స్పందించింది. వారిని కంపెనీలోని ఇతర విభాగాల్లోకి తీసుకుంటామని, వారికి అవసరమైన సాయం అందిస్తామని భరోసా ఇచ్చింది. ప్రయోగాలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని.. అయితే లాభాలు కూడా ముఖ్యమని స్విగ్గీ సీఈఓ శ్రీహర్ష మెజేటి చెబుతున్నారు. బోల్ట్, 99 స్టోర్ లాంటి కొత్త ఫీచర్లతో స్విగ్గీ తన ప్రయోగాలు కొనసాగిస్తున్నప్పటికీ.. స్నాక్ క్లోజింగ్ అనేది కంపెనీ ఆర్థిక క్రమశిక్షణకు అద్ధంపడుతోంది.