బడ్జెట్ అంతా పచ్చి అబద్ధం.. చంద్రబాబు భజన తప్ప ఏం లేదు: వైఎస్ జగన్

బడ్జెట్ అంతా పచ్చి అబద్ధం.. చంద్రబాబు భజన తప్ప ఏం లేదు: వైఎస్ జగన్

అమరావతి: ఏపీ 2026-27 వార్షిక బడ్జెట్‎పై వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ అంతా పచ్చి అబద్ధాలు అని.. అందులో చంద్రబాబు భజన తప్ప ఏమి లేదని విమర్శించారు. గురువారం (ఫిబ్రవరి 19) తాడేపల్లిలో బడ్జెట్‎పై జగన్ మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలను బడ్జెట్ మోసం చేసిందని.. కూటమి ప్రభుత్వం ప్రజలను వెన్నుపోటు పొడిచిందని అన్నారు. 

మోసానికి ఫ్యాంట్, షర్ట్ వేస్తే చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీడీపీ, జీఎస్డీపీపై చంద్రబాబు తప్పుడు లెక్కలు చెబుతున్నారని అన్నారు. ప్రభుత్వం చెప్పిన లెక్కలు నిజమైతే ప్రజల తలసరి ఆదాయం పెరగాలి కదా అని నిలదీశారు. చంద్రబాబు హయాంలో పబ్లిసిటీ పీక్స్.. పెర్ఫామెన్స్ వీక్ అని సెటైర్ వేశారు. 

రాష్ట్ర ఆదాయంపై బడ్జెట్ అంచనాలు పెద్ద మోసమని అన్నారు. వైసీపీ హయాంతో పోల్చితే చంద్రబాబు హయాంలో రాష్ట్ర ఆదాయం పెరుగుదల నామమాత్రమేనని పేర్కొన్నారు. వృద్ధిరేటులో రాష్ట్రం చివరిలో ఉన్నా చంద్రబాబు మాత్రం రాష్ట్రం దూసుకుపోతుందని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగ్ నివేదిక ప్రకారం వృద్ధిరేటులో 22వ స్థానంలో ఉన్నామని.. ఇది చంద్రబాబు అసమర్థతా కాదా అని ప్రశ్నించారు.

రాష్ట్ర అప్పు రూ.7.21 లక్షల కోట్లు మాత్రమేనని.. కాగ్ సహా అన్ని డాక్యుమెంట్స్‎లో అప్పుల లెక్కలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. చంద్రబాబు మాత్రం రాష్ట్ర అప్పు మొత్తం మేమే చెసినట్లు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతయుతమైన స్థానాల్లో ఉన్నవారు ఈ రకంగా అబద్ధాలు చెబుతారని అని నిప్పులు చెరిగారు. 

కూటమి ప్రభుత్వంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం పక్కదోవ పడుతోందని.. ఆ ఆదాయం చంద్రబాబు, ఆయన అనుచరుల జేబుల్లోకి వెళ్తుందని ఆరోపించారు. ఇసుక, గ్రానైట్, మద్యం సహా వనరులన్నీ దోచేస్తు్న్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ఎవరికీ వాళ్లే ప్రైవేట్ విమానాలు, హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.