
తీసింది ఐదే సినిమాలు. అందులో నాలుగు సూపర్ హిట్లు. అందుకే ఆయన డైరెక్షన్ లో సినిమా వస్తుందంటే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. రైటర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి, డైరెక్టర్‌గా సత్తా చాటుతున్న ఆయనే కొరటాల శివ. ఈ స్టార్ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా ఆయన సినిమా జర్నీపై వీ6 వెలుగు స్పెషల్ స్టోరీ.
మనిషి ఆలోచనలు.. వారు పెరిగిన ప్రదేశం, పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని అంటారు. కొరటాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది. సోషల్ మెసేజ్ ఉన్న కథలకు కమర్షియల్ హంగులద్ది పరాజయం పొందని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు కొరటాల. ఆయన హీరోలతో చెప్పించే డైలాగులు ఏ రేంజ్ లో ఉంటాయో.. ఆయన సినిమాల్లో పాటలు అదే రేంజ్ లో ఉంటాయి. కొరటాల సినిమాల కోసం ప్రేక్షకున్ని ఎదురుచూసేలా చేస్తాయి.
విద్యావంతుల కుటుంబం
1975 జూన్ 15న కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్న సోషల్ యాక్టివిస్టుల కుటుంబంలో జన్మించారు. గుంటూరు జిల్లా పెదకాకాని ఆయన స్వస్థలం. ఇంట్లో అందరూ విద్యావంతులే కావడంతో ఇంటి నిండా పుస్తకాలుండేవి. దీంతో చిన్నప్పటి నుంచి బుక్స్ బాగా చదివేవారు. అప్పుడప్పుడూ సరదాగా కవితలు, కథలు రాస్తుండేవారు. బీటెక్ పూర్తి చేసిన తర్వాత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కెరీర్ స్టార్ట్ చేశాడు. సినిమాపై ఉన్న ఆసక్తితో మేనత్త కొడుకైన పోసాని కృష్ణ మురళి వద్ద అసిస్టెంట్ గా చేరాడు. కొంతకాలానికి జాబ్ కు రిజైన్ చేసి డైలాగ్ రైటర్ గా కొత్త జీవితం ప్రారంభించాడు. భద్ర, మున్నా, ఒక్కడున్నాడు, బృందావనం, ఊసరవెల్లి సినిమాలకు మాటలు రాశారు. ఆ తర్వాత ‘మిర్చి’ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. మొదటి సినిమాయే సూపర్ డూపర్ హిట్ కావడంతో కొరటాలకు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
సక్సెస్ఫుల్ జర్నీ
మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు కొరటాల. ‘మిర్చి’ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాదు. ఆరు నంది అవార్డులు తెచ్చిపెట్టింది. మొదటి సినిమాతోనే డైరెక్టర్‌గా నంది పురస్కారాన్ని అందుకున్నాడు. అందరూ మాస్‌గా చూపించే ఫ్యాక్షన్ని కూడా క్లాస్‌గా చూపించి తిరుగులేని డైరెక్టర్ అనిపించుకున్నాడు. కూల్‌గా ఉంటూనే వయలెంట్‌గా రియాక్టయ్యే పవర్ఫుల్ కుర్రాడిగా ప్రభాస్‌ని చూపించి ఫ్యాన్స్ ఊగిపోయేలా చేశాడు. ఆ వెంటనే మహేష్‌బాబుతో చేసిన ‘శ్రీమంతుడు’ కూడా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎన్టీఆర్‌తో ‘జనతాగ్యారేజ్’ తీసి మరోసారి సత్తా చాటాడు. మోహన్‌లాల్ కీలక పాత్రలో నటించడం ఈ సినిమాకి మరింత క్రేజ్‌ను తెచ్చింది. ఆ తర్వాత మహేష్‌తో కొరటాల మరో సినిమా ప్లాన్ చేశాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండో సినిమా ‘భరత్ అనే నేను’ కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రీసెంట్గా చిరంజీవి, రామ్ చరణ్‌తో ‘ఆచార్య’ను తెరకెక్కించిన కొరటాల.. నెక్స్ట్ మూవీ మళ్లీ ఎన్టీఆర్‌తో చేయబోతున్నారు.
అదే స్పెషాలిటీ
కొరటాల సినిమా అనగానే గుర్తొచ్చేది.. మెసేజ్. ఏదో ఒక సందేశం చెప్పేలా కథను అల్లుకుంటాడు. దానికి అన్ని హంగులు జోడించి అద్భుతమైన కమర్షియల్ ఎంటర్టైనర్గా మౌల్డ్ చేస్తారు. పగ తీర్చుకోవడం మగతనం కాదు, పగోడిని సైతం ప్రేమించడమే అసలైన మగతనం అంటూ ‘మిర్చి’లో ప్రభాస్‌తో చెప్పించిన కొరటాల.. ‘ఊరు మనకెంతో ఇచ్చింది. కొంతైనా తిరిగిచ్చేయాలి’ అని శ్రీమంతుడితో ఆలోచన రేకెత్తించాడు. తప్పుడు దారిలో నడిచే ప్రతి ఒక్కడికీ తగిన శిక్ష పడాల్సిందేనంటూ ‘జనతా గ్యారేజ్’లో స్పెషల్‌గా రిపేర్లు చేయించారు. నాయకుడు సరిగ్గా ఉంటే ప్రజలు అంత సంతోషంగా ఉంటారని ‘భరత్ అనే నేను’తో నిరూపించాడు. పవిత్రమైన చోట పాపాలు చేస్తే పాఠం చెప్పడానికి దేవుడే రానక్కర్లేదంటూ ‘ఆచార్య’తో సందేశం పంపారు. మెసేజ్ లేనిదే కొరటాల సినిమాని ఊహించలేం. వ్యక్తిగతంగానూ కొరటాల మంచోడని ఆయన గురించి తెలిసినవారు అంటుంటారు. అందరితో సౌమ్యంగా ఉంటారని, వీలైతే పదిమందికి సాయపడతారని చెబుతుంటారు.
ఏదేమైనా.. సెన్సిబుల్ సబ్జెక్ట్ , ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే, స్టైలిష్ మేకింగ్‌కు కొరటాల కేరాఫ్ అనేది నిజం. భవిష్యత్తులో నిర్మాతగానూ రాణించే ప్లాన్ లో ఉన్న ఆయన నుంచి మరిన్ని మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తూ.. హ్యాపీ బర్త్ డే కొరటాల శివ.