ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి టోవినో థామస్ అవుట్.. అసలు కారణం ఇదే!

ఎన్టీఆర్ 'డ్రాగన్' నుంచి టోవినో థామస్ అవుట్.. అసలు కారణం ఇదే!

మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ అనగానే సినీ ప్రియులకు ముందుగా గుర్తొచ్చేది 'మిన్నల్ మురళి'. తన వైవిధ్యమైన నటనతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, ఇప్పుడు ‘ప‌ళ్లిచట్టాంబి’ (Pallichattambi) అనే పీరియాడిక్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు. కేరళలోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో 1950ల నాటి వలస రైతు సంఘాల జీవన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ఈ మూవీలో కాయదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అయితే, ఈ సినిమా ప్రమోషన్స్ కోసం తెలుగు మీడియా ముందుకు వచ్చిన టోవినో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు.

‘డ్రాగన్’ నుంచి తప్పుకున్న టోవినో!

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ 'డ్రాగన్' లో టోవినో థామస్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ గా టోవినో తాను ఈ సినిమా చేయడం లేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ సినిమా చేయాలని నాకు చాలా ఆశగా ఉంది, కానీ కాల్‌షీట్ల సమస్య కారణంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది అని ఆయన వెల్లడించారు.

వర్కింగ్ కల్చర్‌పై షాకింగ్ కామెంట్స్!

తెలుగులో నేరుగా సినిమా ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు టోవినో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. మలయాళ ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. మేము ఒక సినిమాను ఒకే షెడ్యూల్‌లో పూర్తి చేస్తాము. కానీ తెలుగులో సినిమా పూర్తి కావడానికి ఒకటి, రెండు ఏళ్లు పడుతుంది. ఇక్కడ మేకింగ్ స్కేల్ చాలా పెద్దది, అందుకే మల్టిపుల్ షెడ్యూల్స్ ఉంటాయని చెప్పుకొచ్చారు.

నేను ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయలేను. ఒక సినిమా పూర్తయ్యాకే ఇంకో దానికి వెళ్తాను అని  టోవినో చెప్పారు. ఒకవేళ నేను ఒకే ఒక తెలుగు సినిమా ఒప్పుకుంటే, అది పూర్తి కావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఆ టైమ్‌లో నేను 4 నుంచి 5 మలయాళ సినిమాలు పూర్తి చేయగలను. ఒక సినిమా కోసం మిగతా నిర్మాతలకు ఇచ్చిన మాటను తప్పలేను అంటూ తన నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు.

ప‌ళ్లిచట్టాంబి.. ఏప్రిల్ 10న విడుదల!

డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వం వహించిన ‘ప‌ళ్లిచట్టాంబి’ కేరళ రైతుల అశ్రద్ధకు గురైన చరిత్రను, వారి ఆశయాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతోంది. ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. టోవినో తీసుకున్న ఈ నిర్ణయం ఎన్టీఆర్ అభిమానులను నిరాశపరిచినప్పటికీ, తన సినిమాల పట్ల ఆయనకున్న అంకితభావానికి సినీ వర్గాలు ఫిదా అవుతున్నాయి. మరి ఈ మలయాళ పీరియాడిక్ డ్రామా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి.