ఏపీకి ఫండింగ్.. తెలంగాణకు పెండింగ్! కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో మరోసారి బయటపడ్డ వివక్ష

ఏపీకి ఫండింగ్..  తెలంగాణకు పెండింగ్! కేంద్ర కేబినెట్ నిర్ణయాలతో  మరోసారి బయటపడ్డ వివక్ష
  • ఏపీ, గుజరాత్​ రాష్ట్రాల్లోని మెట్రోలకు ఎడాపెడా అనుమతులు 
  • ఎప్పట్లాగే హైదరాబాద్​ మెట్రో విస్తరణ అంశం​ పక్కకు
  • ఏడాది కింద డీపీఆర్​, నెలన్నర కింద టేకోవర్ ఫైల్ పంపినా స్పందన కరువు
  • ట్రిపుల్​ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు​ ఫైనాన్షియల్ ​క్లియరెన్స్ ​కూడా పెండింగే
  • ఇరిగేషన్​ ప్రాజెక్టుల విషయంలోనూ సహాయ నిరాకరణ
  • ఇప్పటికే పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్​ వెనక్కి
  • తుమ్మిడిహెట్టి విషయంలో సీఎం లేఖ రాసి నెల గడిచినా నో రెస్పాన్స్​
  • మన అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ.. ఏపీకి కొత్త ప్రాజెక్టులు 
  • తెలంగాణ ప్రతిపాదించిన ఇచ్చంపల్లిని కాదని 
  • పోలవరం నుంచే కావేరి లింక్‌‌‌‌‌‌‌‌కు గ్రీన్​సిగ్నల్​
  • తాజా కేంద్ర కేబినెట్​లో ఏపీకి రూ.2,533 కోట్లు కేటాయింపు

హైదరాబాద్, వెలుగు: కేంద్రంలోని ఎన్డీయే సర్కారు తెలంగాణ పట్ల అనుసరిస్తున్న పక్షపాత వైఖరి మరోసారి బయటపడింది. తాజాగా పీఎం  నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే ఇందుకు నిదర్శనంగా నిలిచాయి. దేశవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, పరిపాలనా సౌలభ్యం కోసం రూ. 4,703 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలపగా.. ఇందులో గుజరాత్, ఏపీ రాష్ట్రాలకే పెద్దపీట వేసింది. 

రూ. 2,169 కోట్లతో అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2ఏ  విస్తరణకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. అటు ఏపీలో ఈ ఏడాది ఫిబ్రవరిలోనే  వైజాగ్ మెట్రో (ఫేజ్-1)కు ఆమోదం తెలపగా, విజయవాడ-–అమరావతి మెట్రో కనెక్టివిటీకి  సంకేతాలిచ్చింది. అదే సమయంలో తెలంగాణలో అత్యంత కీలకమైన మెట్రో రెండో దశ అనుమతులు, రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌​) ఫైనాన్షియల్ ​క్లియరెన్స్‌‌‌‌‌‌‌‌ను ఎప్పట్లాగే పెండింగ్ పెట్టింది. కేంద్రం చెప్పినట్లే ఇటీవల ఎల్​అండ్​టీ నుంచి మెట్రోను టేకోవర్​ చేసి ఆ ఫైల్​ను పంపించినప్పటికీ పరిగణనలోకి తీసుకోలేదు. 

అటు సాగునీటి ప్రాజెక్టుల అనుమతులు, ఆర్థిక సహాయ సహకారాలు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారంపైనా  కేంద్రం పూర్తిగా చేతులెత్తేసింది. కొద్దినెలలుగా సీఎం సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నా ఆయా ఫైళ్లు  ఒక్క అడుగు కూడా ముందుకు కదలకపోవడం చర్చనీయాంశంగా మారింది.

‘డబుల్​ ఇంజిన్​ సర్కారు ఉంటేనే అభివృద్ధి’ అంటూ పదేపదే చెప్తున్న బీజేపీ లీడర్లు.. కేవలం రాష్ట్రంలో కాంగ్రెస్​ సర్కారు అధికారంలో ఉందన్న కారణంగానే తెలంగాణను పక్కనపెడ్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  ఈ విషయంలో కేంద్ర తీరు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.

మొత్తం 116.2 కిలోమీటర్ల పొడవుతో ప్రతిపాదించిన ఈ కొత్త ప్రాజెక్టులో 6 కీలక కారిడార్లు ఉన్నాయి.  భవిష్యత్ అవసరాల కోసం ముచ్చర్ల ఫోర్త్ సిటీ కనెక్టివిటీని కూడా ఈ ప్రతిపాదనల్లో చేర్చారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 ఉమ్మడి భాగస్వామ్యం కింద, కేంద్రం నుంచి 20 శాతం ఈక్విటీ నిధుల సహాయాన్ని కోరుతూ సమర్పించిన డీపీఆర్ ప్రస్తుతం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వద్ద తుది ఆమోదం కోసం వేచి చూస్తోంది.  

దీనికి భిన్నంగా, తాజా కేబినెట్ భేటీలో గుజరాత్‌‌‌‌లోని అహ్మదాబాద్ మెట్రో ఫేజ్ 2ఏ  విస్తరణకు రూ. 2,169 కోట్ల అంచనా వ్యయంతో కేంద్రం ఓకే చెప్పింది.  6.032 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో కారిడార్‌‌‌‌ను విమానాశ్రయం, ప్రతిపాదిత కామన్వెల్త్ గేమ్స్ కాంప్లెక్స్‌‌‌‌తో అనుసంధానించనున్నారు.  అటు ఏపీలో ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలోనే  వైజాగ్ మెట్రో (ఫేజ్-1)కు సూత్రప్రాయ ఆమోదం తెలపగా, విజయవాడ-–అమరావతి మెట్రో కనెక్టివిటీకి తాజాగా సంకేతాలు ఇచ్చారు. 

  •  ఏపీ సెక్రటేరియేట్​ నిర్మాణాలకు రూ. 2,534 కోట్లు 

ఏపీలోని అమరావతి అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు ఇచ్చింది. అమరావతిలో రూ. 1,299 కోట్ల వ్యయంతో అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఒకేచోటికి తెచ్చేలా ‘సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాంప్లెక్స్’ నిర్మాణానికి ఆమోదం ముద్ర వేసింది. కేంద్ర ఉద్యోగుల వసతికి రూ. 1,235 కోట్ల వ్యయంతో నివాస సముదాయాల నిర్మాణానికి పచ్చజెండా ఊపింది. మొత్తంగా రూ. 2,534 కోట్లతో అమరావతిలో భారీ భవన నిర్మాణాలకు కేంద్రం లైన్​ క్లియర్​ చేసింది. 

అమరావతి  పునర్నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్ల రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీగా ఉండి ఇప్పించేందుకు అంగీకరించింది. ఏపీ పరిధిలోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్‌‌లో రూ. 9,417 కోట్లు కేటాయించగా, వివిధ 79 రకాల పథకాల ద్వారా రూ. 15,031 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ. 11,465 కోట్లను రిలీజ్‌‌‌‌ చేసింది. విభజన చట్టం కింద మంజూరైన ఐఐటీ, ఐఐటీడీఎం, ఐఐఎం, ఎన్‌‌‌‌ఐటీలాంటి ప్రతిష్టాత్మక సంస్థల శాశ్వత భవనాల నిర్మాణానికి తుది విడత నిధులు ఇచ్చి క్యాంపస్‌‌‌‌లను అందుబాటులోకి తెచ్చింది.

  • పాలమూరు డీపీఆర్ వెనక్కి..

సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేంద్రం నుంచి  గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. దక్షిణ తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలకు కీలకమైన పాలమూరు–-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేసినా సానుకూల నిర్ణయం రాలేదు. పైగా ఈ ప్రాజెక్టు డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను కేంద్రం వెనక్కి పంపింది. 

గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీల అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉందంటూ, మైనర్ ఇరిగేషన్ కింద చూపిన కేటాయింపులపై స్పష్టత లేదంటూ సాంకేతిక కారణాలతో మెలికలు పెట్టింది. ఇదే సమయంలో, ఏపీలోని పోలవరం ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పునరావాస ప్యాకేజీల కోసం కేంద్రం ఇటీవల కాలంలోనే రూ. 2,809 కోట్ల నిధులను నిరాటంకంగా విడుదల చేయడం గమనార్హం.

  • బనకచర్ల లింక్.. ఇచ్చంపల్లికి హ్యాండ్

నదీ జలాల మళ్లింపులోనూ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా కేంద్రం అడుగులు వేస్తున్న తీరుపై ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో ప్రతిపాదించిన ఇచ్చంపల్లి-–కావేరి లింకును పక్కనబెట్టి, ఏపీకి లబ్ధి చేకూర్చేలా పోలవరం-, నల్లమలసాగర్- ,బనకచర్ల మీదుగా తమిళనాడుకు నీటిని తరలించేలా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ఖర్చును పూర్తిగా కేంద్రమే భరించనుండటంతో ఏపీకి పైసా ఖర్చు లేకుండా పని పూర్తవుతుంది. మరోవైపు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు ఎత్తు, నీటి లభ్యతపై చర్చించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తెలంగాణ సీఎం లేఖ రాసి నెల రోజులు గడుస్తున్నా అక్కడి నుంచి స్పందన లేదు.

 పొరుగు రాష్ట్రాలు సహకరించుకోవాలని ప్రధాని మోదీ హితబోధలు చేస్తున్నా, మహారాష్ట్రలోని తమ కూటమి ప్రభుత్వాన్ని ఒప్పించడంలో కేంద్రం ఎలాంటి చొరవ చూపకపోవడంపై రాష్ట్ర వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దేవాదుల ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద అందాల్సిన ఆర్థిక సాయం కూడా అందకపోవడాన్ని ఎత్తిచూపుతున్నాయి.

  • పోలవరం ముంపునూ పట్టించుకుంటలే

పోలవరం ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలను కేంద్రం మాత్రం పెడచెవిన పెడ్తున్నది. ఆ ప్రాజెక్టును ఫుల్ లెవెల్ 45.72 మీటర్లతో నిర్మిస్తే.. ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ ప్రభావంతో తెలంగాణ భూభాగంలోని భద్రాచలం సహా 36 గ్రామాలు మునిగిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా 6 పెద్ద వాగులకు వరద ప్రభావం ఎక్కువగా ఉంది.. భద్రాచలం మునిగిపోయే ముప్పు ఎక్కువగా ఉన్నది. అంతేగాకుండా మణుగూరు భార జల కేంద్రంలాంటి వాటికి ముంపు ముప్పు ఉందని ఇప్పటికే తేలింది. దీనిపై జాయింట్ సర్వే చేయించాలని ఎప్పటి నుంచో మన ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఎన్నో మీటింగుల్లో ఈ డిమాండ్ వినిపించింది. అయితే ఏపీ మాత్రం ముందుకు రాలేదు. 

ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కృష్ణా గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సర్వే చేయించేందుకు సిద్ధమయ్యారు. కానీ అది ఇప్పటికే ముందుకు పడడం లేదు. ఇటీవలే పీపీఏ సీఈవో, ఏపీ అధికారులు, మన అధికారులు కలిసి అక్కడ క్షేత్ర స్థాయిలో పరిశీలన చేపట్టారు. మరి ఆ ముంపు సర్వే ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి. ఇక ఏపీకి లాభం చేసేలా విభజన సమయంలో 7 మండలాలను ఏపీలో  కేంద్రం విలీనం చేసింది. ఆ 7 మండలాల్లోకే శబరి నది వెళ్లిపోయింది. ఫలితంగా దాదాపు 150 టీఎంసీలకు పైగా జలాల్లో మన హక్కులు కోల్పోవాల్సి వచ్చింది. ఇటు లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు కూడా ఏపీ భూభాగంలోకి వెళ్లిపోయింది. దీంతో 460 మెగావాట్ల కరెంటును కేంద్రం ఏపీకి అప్పనంగా కట్టబెట్టినట్టయింది.

  • సమాఖ్య స్ఫూర్తికి విఘాతం

సహజ సిద్ధంగా రావాల్సిన నిధులు, అనుమతుల విషయంలో తెలంగాణకు మొండిచేయి చూపుతున్న కేంద్రం.. ఏపీ, గుజరాత్‌‌‌‌లాంటి రాష్ట్రాలకు మాత్రం అడగకముందే భారీ ప్రాజెక్టులు, వేల కోట్ల నిధులు కేటాయించడం రాజకీయ సమీకరణాల ఫలితమేనన్న విమర్శలు ఉన్నాయి. విభజన చట్టం హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమలను ఇప్పటికే అటకెక్కించిన కేంద్రం, ఇప్పుడు రవాణా, సాగునీటి రంగాన్ని కూడా దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.  

దేశానికి అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న హైదరాబాద్ నగరాన్ని, తెలంగాణ ప్రాంత ప్రజల ప్రయోజనాలను నిర్లక్ష్యం చేయడం సమాఖ్య స్ఫూర్తికే విఘాతమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకే దేశం.. ఒకే విధానం అని చెప్పే పెద్దలు, నిధులు, ప్రాజెక్టుల కేటాయింపుల్లో మాత్రం ఎందుకు ఇంత వ్యత్యాసాన్ని చూపిస్తున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

  • తెలంగాణ ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బ్రేకులు.. అమరావతి ఓఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్​ స్పీడప్..

తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రీజినల్ రింగ్ రోడ్ (ట్రిపుల్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) ఉత్తర భాగానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వకుండా కేంద్రం కొర్రీలు పెడుతున్నది. సౌత్ పార్ట్​కు అప్రైజల్​ అప్రూవల్​ ఇచ్చినా రెండేండ్లుగా కేంద్ర కేబినెట్​ ఆమోదం లభించడం లేదు.  అదే రాజధాని అమరావతితో పాటు విజయవాడ నగరాల భవిష్యత్ రవాణా అవసరాలను తీర్చేందుకు ప్రతిపాదించిన 189 కిలోమీటర్ల భారీ ఔటర్ రింగ్ రోడ్డు  ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

నేషనల్ హైవేస్  ఆధ్వర్యంలో  చేపట్టనున్న ఈ ఎక్స్‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌వే ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో  నిధులను సైతం కేటాయించింది. ఈ మెగా ఓఆర్ఆర్ నిర్మాణంలో  భూసేకరణ  ప్రక్రియకు అయ్యే మొత్తం ఖర్చులో 50 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వమే భరించేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన అధికారిక చర్చలు, సాంకేతిక ఒప్పందాలు ముగింపు దశకు చేరుకున్నాయి.

  • మన మెట్రో పక్కనపెట్టి.. గుజరాత్, ఏపీలకు గ్రీన్ సిగ్నల్ 

హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ అనుమతులపై కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఏడాది కింద సమర్పించిన డీపీఆర్‌‌‌‌‌‌‌‌లు, నెలన్నర క్రితం రాష్ట్ర ప్రభుత్వం మెట్రోను  టేకోవర్ చేసి పంపిన ఫైల్‌‌‌‌‌‌‌‌పై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఎలాంటి స్పందన లేదు. వాస్తవానికి తెలంగాణలో మెట్రో విస్తరణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సూచనలకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ఫేజ్​ 1ను టెకోవర్​ చేసింది.  విస్తరణలో భాగంగా  రూ. 24,269 కోట్ల అంచనా వ్యయంతో మెట్రో ఫేజ్-2 విస్తరణకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసింది.