- ఎగుమతుల్లో భారీ కుంభకోణం జరిగిందన్న హరీశ్ రావు
- నిరాధార ఆరోపణలన్న మంత్రి ఉత్తమ్
- ఫైరవీల కోసం సివిల్ సప్లై కమిషనర్ వద్దకు బీఆర్ఎస్ నేతలు
- అడ్వైజర్ పదవి ఇవ్వకపోవటంతో ఆరోపణలు చేస్తున్నరని విమర్శ
- గిగ్ వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు: మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ, ఫిలిప్పీన్స్ మధ్య బియ్యం ఎగుమతుల్లో అవినీతి జరిగిందన్న హరీశ్ రావు ఆరోపణలు అవాస్తవమని సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలని, ప్రతిపక్ష నేతలు సిఫార్సు చేసిన వారికి పదవులు దక్కలేదనే అక్కసుతోనే సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావు ప్రస్తావించిన ప్రేమ్ చంద్ గార్గ్‌కు, ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీ క్వశ్చన్ అవర్ లో బియ్యం ఎగుమతులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
అందుకే ఈ పరిస్థితి దాపురించింది: హరీశ్
సివిల్ సప్లై శాఖలో బియ్యం ఎగుమతుల్లో భారీ కుంభకోణం జరిగిందని హరీశ్ రావు ఆరోపించారు. రూ.వేల కోట్లలో బ్యాంకు ఫ్రాడ్లు, బంగారం స్మగ్లింగ్ వంటి సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితుడిగా ఉన్న ప్రేమ్ చంద్ గార్గ్ అనే వ్యక్తిని ప్రభుత్వానికి అడ్వైజర్‌గా ఎలా నియమించుకుంటారని హరీశ్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై వెంటనే ‘హౌస్ కమిటీ’ వేయాలని డిమాండ్ చేశారు. ఏడాది కాలంగా సుమారు 7,500 టన్నుల బియ్యం కాకినాడ పోర్టులో నిలిచిపోయి పురుగులు పడుతున్నాయని, వాటాల బేరసారాలు కుదరకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. దీనిపై మంత్రి ఉత్తమ్సమాధానమిస్తూ.. హరీశ్ రావు ప్రస్తావించిన ప్రేమ్ చంద్ గార్గ్‌కు, ఫిలిప్పీన్స్ బియ్యం ఎగుమతులకు ఎలాంటి సంబంధం లేద ని.. ఇది పూర్తిగా తెలంగాణ, ఫిలిప్పీన్స్ ప్రభుత్వాల మధ్య జరిగిన అధికారిక ఒప్పందమన్నారు. ఫిలిప్పీన్స్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభం కారణంగానే ఎగుమతుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. అక్కడ అన్ని దిగుమతులపైనా ఆంక్షలు ఉన్నప్పటికీ కేవలం తెలంగాణ బియ్యానికి మాత్రమే మినహాయింపు లభించిందని పేర్కొన్నారు. కేవలం ఒక షిప్‌మెంట్ మాత్రమే కాకినాడ పోర్టులో నిలిచిపోయిందని, అక్రమాలు ఏవీ జరగలేదని మంత్రి స్పష్టం చేశారు.
ఉద్యోగుల సంక్షేమానికి
ప్రభుత్వం కట్టుబడి ఉంది: డిప్యూటీ సీఎం భట్టి
ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 15వ తేదీ తర్వాతే ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు చెల్లించేవారని, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి తేదీనే వేతనాలు చెల్లిస్తున్నామని గుర్తుచేశారు. గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన మూడు డీఏలను మా ప్రభుత్వం చెల్లించిందన్నారు. సోమవారం క్వశ్చన్ అవర్ లో పీఆర్సీ కమిషన్‌పై హరీశ్ రావు, కేపీ వివేకానంద, సంజయ్ అడిగిన ప్రశ్న లకు ఆయన సమాధానమిచ్చారు. గత ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచడంతో 17 వేల మంది ఉద్యోగుల పదవీ విరమణ ప్రయోజనాల భారం ప్రజా ప్రభుత్వం పైపడింది. ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు రూ. 4,575 కోట్లు ఉన్నాయి. మా ప్రభుత్వం వచ్చాక వాటిని క్లియర్ చేసేందుకు ప్రతినెలా రూ.700 కోట్లు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాం. ప్రమాదవశాత్తు ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ఆ కుటుంబానికి 1.25 కోట్ల ప్రమాద బీమాని అమలు చేయబోతున్నాం” అని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
స్మార్ట్ కార్డుల కోసం డేటా సేకరిస్తున్నం: పొన్నం
మహాలక్ష్మి స్కీంలో స్మార్ట్ కార్డులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. టీజీటీఎస్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వయం సహాయక బృందాలు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ డేటా బేస్‌లు వివిధ వనరుల నుంచి స్మార్ట్ కార్డుల కోసం లబ్ధిదారుల డేటా సేకరిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌల్యభ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
గిగ్ వర్కర్లకు ప్రత్యేక చట్టం: మంత్రి వివేక్ వెంకటస్వామి
గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కొత్త చట్టాన్ని తీసుకురాబోతోందని కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి వివేక్ సమాదానమిచ్చారు. రాష్ట్రంలో లక్షల మంది గిగ్ వర్కర్లు పనిచేస్తున్నారని, వీరికి ఇన్సింటివ్స్ ఇచ్చే అంశంపై ఇన్ టైమ్‌లో డెలివరీ చేయాలని కంపెనీలు చెప్పటం.. వర్కర్లు చేయలేకపోతుండడంతో ఇన్సెంటివ్‌లు రావటం లేదని మంత్రి పేర్కొన్నారు. వర్కర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంపెనీల నుంచి కొంత శాతం అమౌంట్‌ను సెస్ రూపంలో వసూలు చేసి గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. వర్కర్ల పూర్తి వివరాలు ఈ బోర్డులో నమోదవుతాయన్నారు. స్పందించిన విప్ యెన్నం ఈ చట్టం తీసుకొస్తున్నందుకు సీఎంకు, మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల నుంచి యువకులు వలస వచ్చి గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారని, వారికి సాలరీ స్లిప్ ఉండదని దీంతో బ్యాంకులు లోన్లు ఇవ్వటం లేదన్నారు. 10 నిమిషాల్లో డెలివరీ చేయాలని కంపెనీలు టార్గెట్లు విధిస్తున్నాయని, ట్రాఫిక్‌లో డెలివరీలు చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారని యెన్నం ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వికారాబాద్‌లో జరిగిన డీసీసీ మీటింగ్‌లో గిగ్ వర్కర్ల అంశాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రస్తావించారని విప్ బీర్ల ఐలయ్య గుర్తుచేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మంత్రిని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు.
