- డీజిల్ కొరత లేకుండా చూడాలి
- హార్వెస్టర్లు, వ్యవసాయ యంత్రాలకు ప్రత్యేకంగా సప్లై చేయాలి
- డీలర్లకు మంత్రి ఉత్తమ్ ఆదేశాలు
- అన్ని బంకులకు సరఫరా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆర్డర్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయ్స్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో సోమవారం ఒక్కరోజే 7,443 కిలో లీటర్ల పెట్రోల్, 11,081 కిలో లీటర్ల డీజిల్ మొత్తం కలిపి 18,524 కిలోలీటర్ల సరఫరా జరిగిందని వెల్లడించారు. తాజా పరిస్థితిని సమీక్షించేందుకు ఆయిల్ కంపెనీలతో మాట్లాడి అన్ని పెట్రోల్ బంకులకు నిరంతర సరఫరా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
వ్యవసాయ కార్యకలాపాలు, ముఖ్యంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఇంధన కొరత ఎట్టి పరిస్థితుల్లోనూ రావొద్దని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో హార్వెస్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలకు అవసరమైన డీజిల్‌ను ప్రత్యేకంగా సరఫరా చేయాలని డీలర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం, కొత్తగూడెం, వికారాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాల అధికారులకు ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ఇతర రాష్ట్రాల నుంచి డీజిల్ నింపుకోవడానికి వచ్చే వాహనాలను ఆపేయాలని సూచించారు. కొందరు డీలర్లు ధరలు పెరుగుతాయన్న అంచనాలతో నిల్వలను దాచిపెడుతున్నారన్న అనుమానాలపై స్పందించిన ఆయిల్ కంపెనీలు.. అన్ని ఔట్‌లెట్లు ఆటోమేషన్‌లో ఉండటంతో స్టాక్ , లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగుతోందని స్పష్టం చేశాయి.
కృత్రిమ సృష్టిస్తే కఠిన చర్యలు..
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని సివిల్ సప్లయ్స్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు, పుకార్లను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. ప్రయాణికులకు, రవాణా రంగానికి, రైతులకు అవసరమైనంత పెట్రోల్, డీజిల్ స్టాక్ అందుబాటులో ఉందన్నారు. పెట్రోల్, డీజిల్‌ను ఇండ్లలో అక్రమంగా నిల్వ చేసుకోవద్దని హెచ్చరించారు.
జిల్లాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని, కొరత సృష్టించినా, ఇంధనాన్ని దాచిపెట్టినా, పుకార్లు పుట్టించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎవరైనా అక్రమంగా ఇంధనాన్ని దాచిపెడుతున్నట్టు తెలిస్తే హెల్ప్‌లైన్ నంబర్ 1967కు కాల్ చేయాలని కోరారు.

