టీఆర్ఎస్​లో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది

టీఆర్ఎస్​లో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :జిల్లా టీఆర్ఎస్​లో అసమ్మతి రోజురోజుకు పెరుగుతోంది. తమను పార్టీ పట్టించుకోవడం లేదని, తామేం పాపం చేశామని లీడర్లు నిరసన తెలుపుతున్నారు. మొన్న పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడు రేగాకాంతారావుపై నిప్పులు చెరిగారు. నిన్న అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పార్టీ పెద్ద లీడర్ల తీరుపై మండిపడ్డారు. ఇక గురువారం ప్రభుత్వ విప్​ రేగా కాంతారావు సొంత మండలమైన కరకగూడెం జడ్పీటీసీ కొమరం కాంతారావు టీఆర్ఎస్​ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేగా ఒంటెద్దు పోకడలకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి షాక్​ ఇచ్చారు. జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో అసమ్మతి నివురుగప్పిన నిప్పులా మారింది. 

పార్టీ నేతల మధ్య సమన్వయ లోపం

జిల్లాలో పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయ లోపించింది. ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. జడ్పీటీసీ కొమరం కాంతారావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం పినపాక నియోజకవర్గంలో కలకలం రేపింది. తాను కేటీఆర్​కన్నా రాజకీయాల్లో సీనియర్​ అని, అయినా తనను పార్టీ ప్రోగ్రామ్​లకు పిలవకుండా అవమానిస్తున్నారని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఫైర్​ అయ్యారు. అంతకు కొద్ది రోజుల ముందు పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సోషల్​ మీడియా వేదికగా  విప్​ రేగా కాంతారావు ఒంటెద్దు పోకడపై మండిపడ్డారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే స్థాయిలో పోస్టులు పెట్టడంపై పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేశారు. ఇక కొత్తగూడెంలో జిల్లా అధ్యక్షుడు రేగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మధ్య విభేదాలు బహిరంగ రహస్యమే. బూర్గంపాడులోనూ రేగా కాంతారావుకు వ్యతిరేకంగా పలువురు టీఆర్ఎస్​ లీడర్లు పావులు 
కదుపుతున్నారు. 

ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మధ్య వార్

అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో చేరారు. సిట్టింగ్​ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై గెలిచిన మెచ్చ టీఆర్ఎస్​లో చేరాక ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆయనతో పాటు మాజీ మంత్రి తుమ్మల పార్టీలో సీనియర్​నైన తనను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. పార్టీ ప్రోగ్రామ్​లకు పిలవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న తాటి వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం పార్టీలో చర్చానీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా గెలిచాక రేగా కాంతారావు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్​లో చేరి ప్రభుత్వ విప్​గా పదవి పొందడంతో పాటు ఇటీవల టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్టీలో తమకు సముచిత స్థానం ఇవ్వడం లేదని జిల్లా అధ్యక్షుడిపై మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపణలు చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి పినపాక నియోజకవర్గంలో పర్యటించిన టైంలో రేగా వర్గీయులు అడ్డుకోవడం, రేగాపై పాయం నిప్పులు చెరగడంతో వీరి మధ్య విభేదాలు బయటపడ్డాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్​ ఒకరి ముఖం మరొకరు చూసుకునే పరిస్థితి లేదు. సీపీఐ, టీడీపీ మద్దతుతో కాంగ్రెస్​ నుంచి గెలిచిన వనమా ఆ తరువాత గులాబీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి వనమా వర్సెస్​ జలగం అన్నట్టుగా వర్గపోరు సాగుతోంది. ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో వనమా వెంకటేశ్వరరావు తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావ్​ కోర్టుకు వెళ్లారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బానోత్​ హరిప్రియ, జడ్పీ చైర్మన్​ కోరం కనకయ్య మధ్య కయ్యం కొనసాగుతోంది. ఎమ్మెల్యే హరిప్రియ భర్త మార్కెట్​ కమిటీ చైర్మన్​ హరిసింగ్​ జడ్పీ చైర్మన్​ వర్గానికి చెందిన టేకులపల్లి సొసైటీ డైరెక్టర్​ లక్కినేని సురేందర్​తో పాటు పలువురిని వేధిస్తున్నాడనే ఆరోపణలున్నాయి. ఆయన వేధింపులతోనే పార్టీ మారుతున్నట్లు లక్కినేని ప్రకటించి కాంగ్రెస్​లో చేరారు. ఇదిలాఉంటే టీఆర్ఎస్​ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత హడావుడి చేసిన రేగా, లోకల్​ లీడర్లకు తెలవకుండా పర్యటించొద్దని ముఖ్య నేతలకు హుకుం జారీ చేశారు. మండలాల వారీగా పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేస్తానని మొదట్లో హల్​ చల్​ చేసిన ఆయన ఆ తరువాత సైలెంట్​ అయ్యారు.