తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి కొత్త పెన్షన్లు

తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్.. ఆగస్ట్ 15 నుంచి కొత్త పెన్షన్లు
  • పంద్రాగస్టు వేడుకల్లో  ‘చేయూత’ కానుక
  • కొత్తగా 2.50 లక్షల పింఛన్ల మంజూరుకు కసరత్తు
  • ఈ నెల 15న లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి
  • జిల్లాల్లో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రుల చేతుల మీదుగా ప్రొసీడింగ్స్ పంపిణీ
  • తలసేమియా, సికిల్‌‌‌‌‌‌‌‌సెల్ ఎనీమియా బాధితులకూ కొత్తగా పెన్షన్‌‌‌‌‌‌‌‌
  • కొత్త పింఛన్ల మార్గదర్శకాలు ఖరారు.. నేడో రేపో జీవో విడుదల
  • 15 వరకు లైవ్ అథెంటికేషన్​ 
  • డెడ్ లైన్,13 జిల్లాల్లో 100% పూర్తి
  • గ్రేటర్ పరిధిలోనే జాప్యం.. 
  • హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో 78,313, మేడ్చల్‌‌‌‌‌‌‌‌లో 33,410, రంగారెడ్డిలో 21,277 పెండింగ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సామాజిక భద్రత కల్పించే ‘చేయూత’ పింఛన్ల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా తొలిదశలో సుమారు 2.50 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతున్నది. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా, జిల్లాల్లో ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి మంత్రులు లబ్ధిదారులకు పింఛన్ ప్రొసీడింగ్స్ అందజేసేలా ప్లాన్ చేశారు.  అయితే, కొత్త పింఛన్ల పంపిణీకి సంబంధించి అధికారులు ఇప్పటికే మార్గదర్శకాలను ఖరారు చేశారు. 

సీఎం ఆదేశాల మేరకు నేడో రేపో ఇందుకు సంబంధించిన జీవో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సారి వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులతోపాటు తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియా బాధితులకు కూడా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో గతంలో 42 లక్షల పింఛన్లు ఉండగా, అనర్హుల ఏరివేత తర్వాత ఆ సంఖ్య 39 లక్షలకు చేరింది. ఇప్పుడు కొత్తగా మరో 2.50 లక్షల మందికి ఈ పథకంలో లబ్ధి చేకూరనున్నది. 

 కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన (డిసెంబర్ 2023) నాటి నుంచి ఇప్పటివరకు మొత్తంగా 1,23,625 మంది కొత్త లబ్ధిదారులకు పింఛన్లను మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్లు 82,625, వితంతువులు 19,044, హెచ్‌‌‌‌‌‌‌‌ఐవీ-ఏఆర్‌‌‌‌‌‌‌‌టీ 13,830, డయాలసిస్ బాధితులు 6,996, దివ్యాంగులు 982, ఒంటరి మహిళలు 53, ఫైలేరియా బాధితులు 50, చేనేత కార్మికులు 21, గీత కార్మికులు 13, బీడీ కార్మికులకు 11 పింఛన్లు అందజేశారు.  దీనికితోడు అదనంగా మరో రెండున్నర లక్షల చేయూత పింఛన్లను పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించారు. 

లైవ్‌‌‌‌‌‌‌‌నెస్ అథెంటికేషన్‌‌‌‌‌‌‌‌కు 15 డెడ్‌‌‌‌‌‌‌‌లైన్..

అనర్హులను తొలగించి పారదర్శకంగా పింఛన్లు అందించేందుకు సెర్ప్ చేపట్టిన ‘ఈ-కేవైసీ, లైవ్‌‌‌‌‌‌‌‌నెస్ అథెంటికేషన్’ సర్వేకు ఈ నెల 15ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 19,04,239 మంది పింఛన్‌‌‌‌‌‌‌‌దారులు ఉండగా.. ఇప్పటివరకూ 15.74 లక్షల మంది పరిశీలన పూర్తయింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆదిలాబాద్, జగిత్యాల, జనగామ, కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, ములుగు, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఇప్పటికే 100 శాతం లైవ్‌‌‌‌‌‌‌‌నెస్ అథెంటికేషన్ పూర్తయింది. పంచాయతీ కార్యదర్శులు, సెర్ప్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి ప్రక్రియను వేగంగా పూర్తి చేశారు.

గ్రేటర్‌‌‌‌‌‌‌‌ పరిధిలో పడకేసింది

జిల్లాల్లో ప్రక్రియ వేగంగా జరుగుతుంటే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు జిల్లాల్లో మాత్రం అధికారుల అలసత్వంతో పింఛన్ల వెరిఫికేషన్ పడకేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,61,569 పింఛన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉంటే.. అందులో 1.33 లక్షలకు పైగా పింఛన్లు ఈ మూడు జిల్లాల్లోనే పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉండటం గమనార్హం. హైదరాబాద్ జిల్లాలోని మొత్తం 2,53,330 లబ్ధిదారుల్లో కేవలం 1,65,622 మందికే (69.09%) ఈ- కేవైసీ పూర్తయింది. ఇంకా 78,313 పింఛన్లు పెండింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాయి. 

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 67.32% నమోదు కాగా.. ఇంకా 33,410 మంది లబ్ధిదారుల ఆచూకీ తేలాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలో  68.77% మాత్రమే పూర్తి కాగా, 21,277 పింఛన్ల లైవ్‌‌‌‌‌‌‌‌నెస్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. కార్పొరేషన్లు, మున్సిపల్, మెప్మా సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనను గాలికి వదిలేశారనే విమర్శలు వస్తున్నాయి. నగరాల్లో నివాసాలు మారడం, అద్దె ఇళ్లల్లో ఉండటం, సిబ్బంది కొరత కారణాలుగా చెబుతున్నప్పటికీ.. నెలలు గడుస్తున్నా ఆచూకీ తీయకపోవడంపై ఉన్నతాధికారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.