ఆర్యవైశ్యుల్లో విడాకులు పెరుగుతున్నయ్: కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత ఆందోళన

ఆర్యవైశ్యుల్లో విడాకులు పెరుగుతున్నయ్: కార్పొరేషన్ చైర్ పర్సన్ కాల్వ సుజాత ఆందోళన

మల్కాజిగిరి, వెలుగు: ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార, ఉద్యోగ రంగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొని నాయకత్వ స్థానాలను అధిష్టించాలని రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్​పర్సన్ కాల్వ సుజాత గుప్తా పిలుపునిచ్చారు. బుధవారం మల్కాజిగిరిలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ఆర్యవైశ్య సంఘం కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

మన సామాజిక వర్గ ప్రతినిధులను గెలిపించుకోవడం ద్వారా సమస్యలను త్వరగా పరిష్కరించుకోవచ్చన్నారు. ప్రస్తుతం ఆర్యవైశ్య కుటుంబాల్లో విడాకుల సమస్యలు పెరుగుతున్నాయని, ఇందుకోసం కార్పొరేషన్ కార్యాలయానికి రావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా సంఘ సభ్యులు ముందుండి చొరవ తీసుకోవాలని సూచించారు. 

వ్యాపార రంగం స్థిరమైనదని, ఉద్యోగస్తులతో పాటు వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా తమ పిల్లలను ఇచ్చి వివాహం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా, నూతన అధ్యక్షుడు అల్లంపల్లి సురేశ్ గుప్తా, ఇతర సభ్యులు పాల్గొన్నారు.