హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ (డీఎంఈ) పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల అబ్సార్ప్షన్ పై ప్రక్రియ డీఎంఈ కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ పూర్తి చేసిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ల (సీఏఎస్) ను రూల్స్ కు విరుద్ధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకునే క్రమంలో జారీ చేసిన పోస్టింగ్ ఆర్డర్లను హోల్డ్‌లో పెట్టాలని డీఎంఈ (అకాడమిక్) డాక్టర్ కె. శివరాం ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు.
ఇంకా ప్రొబేషన్ పీరియడ్ పూర్తికాని, రెగ్యులరైజ్ కాని వారిని విధుల్లోకి తీసుకోవద్దని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, టీవీవీపీ కమిషనర్లకు ఆయన లేఖ రాశారు. కాగా.. మల్టీ జోన్-1, మల్టీ జోన్ -2 పరిధిలో పీజీ క్వాలిఫికేషన్ ఉన్న సీఏఎస్, సీఏఎస్ స్పెషలిస్ట్ డాక్టర్లను అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమించేందుకు ప్రభుత్వం కౌన్సెలింగ్ నిర్వహించింది. కౌన్సెలింగ్ కు హాజరైనప్పటికీ, సర్వీస్ నిబంధనలు పూర్తికాని వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా తీసుకోవద్దని, వారి పోస్టింగ్ ఆర్డర్లను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు అమలు చేయవద్దని సూచించారు.
అయితే, పోస్టింగులను హోల్డ్ లో పెట్టడం ప్లాన్ ప్రకారం జరుగుతున్నదని పలు డాక్టర్ల సంఘాలు ఆరోపించాయి. ఈనెల 25న డీఎంఈ ఆవరణలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించిన అధికారులు.. అదే రోజు హడావుడిగా పోస్టింగ్ ఆర్డర్లు జారీ చేయడంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వెరిఫికేషన్ లో ఏం చూశారు? కావాలనే తప్పు చేశారా? అని ప్రశ్నిస్తున్నాయి. రూల్స్ ప్రకారం ప్రకారం ప్రొబేషన్ పూర్తికాని వారు ఈ ప్రక్రియకు అనర్హులని తెలిసినప్పటికీ, సుమారు 25 మందికి పైగా అనర్హులకు ఆర్డర్లు ఎలా ఇచ్చారని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు.

