- తమిళ ప్రజలది లౌకికవాదం:భట్టి
- రాహుల్ గాంధీతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం
హైదరాబాద్, వెలుగు: తమిళనాడులో డీఎంకే కూటమి తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడులోని రాణిపేట జిల్లా షోలింగేర్ సర్కిల్ పండియానల్లుర్ లో ఏర్పాటు చేసిన రాహుల్ గాంధీ బహిరంగ సభకు డిప్యూటీ సీఎం హాజరయ్యారు. అంతకుముందు రాణిపేట జిల్లా కాంగ్రెస్ ముఖ్యనాయకులతో భట్టి సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ నాయకత్వంలోని కూటమి భారీ మెజారిటీతో మరోసారి గెలుస్తుందని తెలిపారు. లౌకికవాదాన్ని సంరక్షించడంలో తమిళ ప్రజలు ఎప్పుడూ ముందుంటారని, ఆత్మగౌరవానికి తమిళనాడు మారుపేరుగా నిలుస్తుందన్నారు. తమిళనాడు అంటే కేవలం ఒక రాష్ట్రం కాదని.. అదొక సిద్ధాంతమని.. పెరియార్, అన్నాదురై, కలైంజర్ కరుణానిధి వంటి గొప్ప నేతలు ఇక్కడ సామాజిక న్యాయానికి పునాది వేశారని గుర్తుచేశారు.
తమిళ సంస్కృతిని దెబ్బతీయాలని చూస్తున్నారు..
ఢిల్లీలోని బీజేపీ పెద్దలు తమిళనాడు సంస్కృతి, హక్కులను కాలరాయాలని చూస్తున్నారని భట్టి విమర్శించారు. వారిని ఎదుర్కోవాలంటే సెక్యులర్ శక్తులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. సీఎం స్టాలిన్ నాయకత్వంలో తమిళనాడు అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ ప్రేమ సందేశం.. స్టాలిన్ అభివృద్ధి నినాదం ఒకటిగా మారి డీఎంకే కూటమి గెలుబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ గెలుపు కేవలం తమిళనాడుకే కాదు.. దేశానికి దిక్సూచిగా మారబోతుందని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, డీఎంకే కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

