లోక్ సభలో కాంగ్రెస్ తో కలిసి కూర్చోలేం :స్పీకర్ కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ

లోక్ సభలో కాంగ్రెస్ తో కలిసి కూర్చోలేం :స్పీకర్ కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ
  • ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని స్పీకర్​కు డీఎంకే ఎంపీ కనిమొళి లేఖ

న్యూఢిల్లీ: తమకు కాంగ్రెస్​తో సంబంధం లేదని, లోక్​సభలో డీఎంకే ఎంపీలకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని డీఎంకే పార్లమెంటరీ పార్టీ నేత కనిమొళి కరుణానిధి కోరారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం లోక్​సభ స్పీకర్​ఓం బిర్లాకు ఆమె లేఖ రాశారు. రాజకీయ పరిస్థితులు మారిపోయాయి.. కాంగ్రెస్‌‌‌‌తో తమ మైత్రి ముగిసిందన్నారు. ఇకపై ఆ పార్టీ ఎంపీల పక్కన కూర్చోవడం భావ్యం కాదని లేఖలో పేర్కొన్నారు. 

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. డీఎంకే కూటమి ఆశించిన మెజారిటీ సాధించలేకపోయింది. దీంతో డీఎంకేతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి 5 సీట్లు గెలిచిన కాంగ్రెస్​ టీవీకేకు మద్దతు ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని డీఎంకే  వెన్నుపోటుగా భావిస్తోంది. 22 ఏండ్ల బంధాన్ని కాంగ్రెస్ తుంచుకుందని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.  

ఇండియా కూటమికి దెబ్బ

లోక్‌‌‌‌సభలో 22 మంది ఎంపీలు ఉన్న డీఎంకే, ప్రతిపక్ష ఇండియా కూటమిలో నాలుగో అతిపెద్ద పార్టీ. వీరు విడిపోవడం జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బ. రాజకీయ విభేదాల వల్ల తమిళనాడులోని పలు ప్రాంతాల్లో డీఎంకే, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. డీఎంకే ఇకపై జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్‌‌‌‌కు వ్యతిరేక దిశలో ప్రయాణించే అవకాశం ఉంది. 

సమర్థించుకుంటున్న కాంగ్రెస్​

డీఎంకే విమర్శలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. 2014 ఎన్నికల్లో డీఎంకే కూడా ఒంటరిగా పోటీ చేసిందని, ప్రస్తుతం తాము తీసుకున్న నిర్ణయంలో తప్పేమీ లేదని సమర్థించుకుంటోంది. ఈ పరిణామాలతో జాతీయ రాజకీయాల్లో, ముఖ్యంగా ఇండియా కూటమిలో ఎలాంటి మార్పులు వస్తాయోనన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.