- నేర చరిత్ర ఉన్నవారిపై మాత్రం చర్యలు ఉంటాయని వెల్లడి
న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆందోళనకారులపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. అయితే, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇదివరకే నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఈ మినహాయింపు వర్తించదని చెప్పింది. వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నిరసనలకు సంబంధించి ఇప్పటికే ఎవరైనా అరెస్ట్ లేదా నిర్బంధంలో ఉంటే వెంటనే వారిని విడుదల చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నెల 20న సీజేపీ చేపట్టిన ‘చలో సంసద్’ మార్చ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.
జంతర్ మంతర్ వద్ద ఏర్పాటు చేసిన హై-రెజల్యూషన్ ఫేషియల్ రికగ్నిషన్ (ఎఫ్‌ఆర్ఎస్) కెమెరాల ద్వారా పరిశీలించగా, నిరసనలో పాల్గొన్న వారిలో 2,800 మందికి పైగా నేర చరిత్ర కలిగిన వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అలాగే, సోషల్ మీడియాలో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొందరిపై ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ కేసులు నమోదు చేసింది.
