సర్ పై నిర్లక్ష్యం వద్దు ..ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అలర్ట్ గా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి

సర్ పై నిర్లక్ష్యం వద్దు ..ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అలర్ట్ గా ఉండాలి: సీఎం రేవంత్ రెడ్డి
  • పేదల ఓట్లుపోతే రేషన్ కార్డు, ఆధార్ కూడా పోతయ్
  • అర్హత ఉన్న ఏ ఒక్కరి ఓటు కూడా పోవద్దు 
  • అది మీకు, పార్టీకి నష్టమేచాలా మంది ఎమ్మెల్యేలు 
  • సర్​ను పట్టించుకోవడం లేదు: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  • ప్రతి ఓటునూ కాపాడేలా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలి: పార్టీ ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్

హైదరాబాద్, వెలుగు:  సర్​పై ఎమ్మెల్యేలు, మంత్రులు  నిర్లక్ష్యంగా ఉంటే   పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని, ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రాబోయే ఎన్నికల్లో మన భవిష్యత్తుపై  ప్రభావం పడుతుందని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు. తక్షణమే పార్టీ క్యాడర్​ను అప్రమత్తం చేసి గురువారం నుంచి ప్రారంభం కానున్న సర్ ప్రక్రియపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని సూచించారు.   

బుధవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల ‘సర్’ ఇన్​చార్జీలతో నిర్వహించిన జూమ్ మీటింగ్​లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.  సర్  చాలా సీరియస్ విషయమని,  లీడర్లు మాత్రం  నాన్ సీరియస్​గా వ్యవహరిస్తున్నారని సీఎం అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు సర్​పై జరిగిన అవగాహన సదస్సుల రిపోర్టు జిల్లాల వారీగా తన  దగ్గర ఉందని,  పార్టీ  తరఫున  మరిన్ని అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆదేశించారు. 

పేదల ఓట్లు పోతే వాళ్ల రేషన్ కార్డు,  ఆధార్ కార్డు పోతుందని,   సర్​లో ఏ ఒక్క   పేదోడి  ఓటు తొలగించకుండా   ఎమ్మెల్యేలు, మంత్రులు చూడాలని  స్పష్టం చేశారు. సర్​ ప్రక్రియ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే  ఇంచార్జీ మంత్రులను కూడా మార్చేందుకు వెనుకాడబోమన్నారు. పార్టీ కోసం పనిచేయని వారు కాంగ్రెస్​కు అవసరం లేదని, ఈ విషయంలో ఎంతటి పెద్దవారినైనా సరే ఉపేక్షించేది లేదని సీఎం హెచ్చరించారు.  

ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వీడాలి: మహేశ్​గౌడ్​

కాంగ్రెస్​కు, లౌకిక వాదానికి అనుకూలంగా ఉండే ఓట్లు తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.  ఈ విషయంలో ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలన్నారు.   బీఎల్‌‌ఏలు   కీలకంగా వ్యవహరించాలన్నారు.
కొందరు ఎమ్మెల్యేలు సర్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,   మరికొందరు ఎమ్మెల్యేలు అసలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

‘  పశ్చిమ బెంగాల్‌‌‌‌‌‌ లో ఏం జరిగిందో చూశాం...దేశంలో బీజేపీ ఎలాంటి కుట్రలు చేస్తుందో చూస్తున్నాం..వీటిని చూసి అయినా మనం మారకుంటే మన ఉనికికే ప్రమాదం’  అని   హెచ్చరించారు. నిరక్షరాస్యులు, పేదలు, గ్రామీణులకు సర్ పై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్   ఎమ్మెల్యేలను కోరారు. గ్రామాల్లో ఎన్నికల సమయంలో  టెంట్లు వేసుకొని పార్టీ గెలుపు కోసం పనిచేసినట్టే  గురువారం నుంచి కూడా  పనిచేయాలని సూచించారు. బీఎల్ఏ లు ప్రస్తుతం ఉన్న ఓటర్ లిస్టులను దగ్గర పెట్టుకొని మ్యాపింగ్ చేసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడడం మన బాధ్యత అని అన్నారు.

 గ్రామాల్లో పార్టీ సర్పంచులతో సర్​పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ‘సర్’ పై ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వారికి పది రోజుల సమయం ఇస్తా.. ఈలోగా తమ పనితీరు మార్చుకుంటే ఓకే, లేదంటే ఆ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ బాధ్యతల నుంచి వారిని తప్పించి, చురుగ్గా పనిచేసే మరొకరికి  బాధ్యతలు అప్పగిస్తా.
- సీఎం రేవంత్ రెడ్డి