‘పెద్ది’ విగ్రహాన్ని తొలగించవద్దు: బీఆర్‌‌‌‌ఎస్

‘పెద్ది’ విగ్రహాన్ని తొలగించవద్దు: బీఆర్‌‌‌‌ఎస్

నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా నర్సంపేటలోని మెడికల్ కాలేజీ ఎదుట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌‌‌‌ రెడ్డి విగ్రహాన్ని బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు ప్రతిష్ఠించడంతో మూడు రోజులుగా ఉద్రిక్తత నెలకొంది. అనుమతులు లేవనే కారణంతో విగ్రహం కోసం నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు ఈ నెల 9న రాత్రి కూల్చివేశారు.

దీంతో ఆగ్రహించిన బీఆర్‌‌‌‌ఎస్ కార్యకర్తలు 10న మళ్లీ గద్దె నిర్మించి, విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాగా, మంగళవారం రాత్రి బీఆర్‌‌‌‌ఎస్ నాయకులతో పోలీసులు చర్చించి, విగ్రహ ఏర్పాటుకు అనుమతి లేదని, 24 గంటల్లో స్వచ్ఛందంగా తొలగించాలని సూచించారు.

ఈ నేపథ్యంలో బుధవారం బీఆర్‌‌‌‌ఎస్ క్యాడర్ సమావేశం నిర్వహించగా, వరంగల్ సీపీ శ్వేత నర్సంపేటకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరంగల్ హెడ్‌‌‌‌క్వార్టర్స్ నుంచి పెద్ద సంఖ్యలో రిజర్వ్ పోలీసులు రావడంతో మరింత ఉత్కంఠ నెలకొంది.

ఇదిలా ఉండగా, పెద్ది సుదర్శన్‌‌‌‌రెడ్డి విగ్రహాన్ని తొలగించవద్దని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్‌‌‌‌కుమార్, నర్సంపేట ఆర్డీవో ఉమారాణికి బీఆర్‌‌‌‌ఎస్ నాయకులు బుధవారం వినతిపత్రం అందజేశారు. వరంగల్ రోడ్డులో త్వరలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.