- జీవో 59 కింద పంపిణీకి ఏర్పాట్లు
- కలెక్టర్లకు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఆదేశాలు
- అర్హత ప్రకారం చార్జీలు చెల్లించిన వారికే అందజేత
- 53 వేల అప్లికేషన్లు వస్తే 25 వేల దరఖాస్తుల రెగ్యులరైజేషన్‌కు ఓకే
హైదరాబాద్, వెలుగు: ఎట్టకేలకు 59 జీవో కింద రెగ్యులరైజేషన్ పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాసెస్‌లో ఉందంటూ దాదాపు ఏడాది పాటు పెండింగ్‌లో పెట్టిన ప్రభుత్వం.. తాజాగా రెగ్యులరైజేషన్ కన్వేయెన్స్ డీడ్స్ (పట్టాలు) పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని గ్రామాల్లో అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమక్షంలో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీసీఎల్ కమిషనర్ నవీన్ మిట్టల్ కలెక్టర్లకు సర్య్కులర్ జారీ చేశారు.
2014కి ముందు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని 59 జీవో ప్రకారం దరఖాస్తు చేసుకొని, అర్హత ప్రకారం చార్జీలు చెల్లించిన వారికి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. రెగ్యులరైజేషన్ కింద పూర్తి పేమెంట్ చేసిన వారి వివరాలను మీసేవ వెబ్ పోర్టల్ ఎమ్మార్వో లాగిన్‌లో పెట్టినట్లు తెలిపారు. ఎమ్మార్వోలే బయోమెట్రిక్ ద్వారా కన్వేయెన్స్ డీడ్స్‌ను జనరేట్ చేసేలా వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. గ్రామాల వారీగా, పూర్తి వివరాలను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ఎమ్మార్వోలు కన్వేయెన్స్ డీడ్‌ను డౌన్‌లోడ్ చేయాలని స్పష్టం చేశారు. క్యూఆర్ కోడ్ రూపంలో జనరేట్ అయ్యే డీడ్మూడు పేజీలు ఉంటుందని, ఆ ప్రింట్‌లో ఎమ్మార్వో సంతకం చేయాల్సి ఉంటుందని చెప్పారు. 59 జీవో ప్రకారం ఎలాంటి స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు, ట్రాన్స్‌ఫర్ డ్యూటీ లాంటివి ఏవీ ప్రత్యేకంగా కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు.
సగంలోపే అప్రూవల్స్..
59 జీవో కింద రెగ్యులరైజేషన్‌కు వచ్చిన అప్లికేషన్లలో సగంలోపే అప్రూవల్ అయ్యాయి. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన ఇండ్ల రెగ్యులరైజేషన్‌కు ఈ జీవో కింద 53,748 అప్లికేషన్లు వచ్చాయి. వీటిని పరిశీలించాక 25 వేల అప్లికేషన్లకు మాత్రమే అర్హత ఉందని ప్రభుత్వం గుర్తించింది. వారికే పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించింది. కాగా, 125 గజాలలోపు ఉంటే ఉచితంగా రెగ్యులరైజేషన్ చేయగా, 125 గజాలకు మించిన వారు కనీస ఫీజు చెల్లించారు. 250 గజాల్లోపు ఇండ్లు నిర్మించుకుంటే ఆ ఏరియాలో ప్రభుత్వ ధరలో 25 శాతం కనీస ధర, 251 నుంచి 500 గజాల్లో ఇండ్లు నిర్మించుకుంటే 50 శాతం కనీస ధర, 500 నుంచి 1,000 గజాల్లోపు నిర్మించుకుంటే 75 శాతం ఫీజును చెల్లించారు. వీటికి అదనపు ఫీజులు కూడా ప్రభుత్వం వసూలు చేసింది.
