ఇల్లెందు, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఏరియా హాస్పిటల్‌లో అచేతనంగా ఉన్న మూడు నెలల పసికందుకు డాక్టర్ ప్రాణం పోశాడు. ఆదివారం ఇల్లెందు ఏరియా హస్పిటల్‌కు ఎటువంటి హృదయ స్పందన, శ్వాస లేకుండా అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న బాలుడిని తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డ్యూటీ డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్, వైద్య బృందం వెంటనే అత్యవసర చికిత్స అందించారు.
సీపీఆర్ ద్వారా ప్రాణవాయువును అందించారు. గుండె స్పందనను పునరుద్ధరించడానికి 3 డోసుల అడ్రినలిన్ అందించారు. వైద్యుల శ్రమతో శిశువు గుండె తిరిగి కొట్టుకోవడం ప్రారంభమైంది. శిశువు ఆరోగ్యం నిలకడగా ఉండడానికి చర్యలు చేపట్టారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా 3.5 ఈటీ ట్యూబ్ వేసి ఏఎంబీయూ బ్యాగ్ ద్వారా సాయం అందించారు. పసికందు రక్త ప్రసరణ మెరుగుపరచడానికి డోపమైన్, డోబుటమైన్ మందులు వేయడం ప్రారంభించారు.
ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో అంబులెన్స్‌లో డాక్టర్ వెళ్లి సిరంజి పంప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ, శిశువును సురక్షితంగా చేర్చారు. డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్, నర్సింగ్ టీమ్ ప్రదర్శించిన సమయస్ఫూర్తి, అంకితభావం ఒక ప్రాణాన్ని కాపాడింది. మృత్యువు అంచున ఉన్న శిశువుకు ప్రాణం పోసిన డాక్టర్, సిబ్బందిని ఎమ్మెల్యే కోరం కనకయ్య, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి రవిబాబు, ఇల్లెందు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ జి హర్షవర్ధన్, ఆర్ఎంవో డాక్టర్ రాంనివాస్, వైద్యులు, పలువురు ప్రముఖులు అభినందించారు.

