జీతాలు రాక..కష్టాల్లో 698 మంది డాక్టర్లు

జీతాలు రాక..కష్టాల్లో 698 మంది డాక్టర్లు
  • 3 నెలలుగా అందని జీతాలు

హైదరాబాద్, వెలుగు:సర్కార్ దవాఖాన్లలో సేవలు అందిస్తున్న సీనియర్‌‌‌‌ రెసిడెంట్‌‌ డాక్టర్లకు మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదు. మహబూబ్‌‌నగర్‌‌ మెడికల్ కాలేజీ‌‌ అనుబంధ హాస్పిటల్‌‌, హైదరాబాద్‌‌లో ని సరోజినిదేవి కంటి దవాఖానలో చేస్తున్న డాక్టర్లకు ఏడు నెలలుగా, ఆదిలాబాద్‌‌ రిమ్స్‌‌, హైదరాబాద్‌‌లోని కింగ్ కోఠి హాస్పిటల్‌‌లో చేస్తున్న డాక్టర్లకు ఐదు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. దీంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 18 హాస్పిటళ్లలో మొత్తం 698 మంది డాక్టర్లు జీతాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీళ్లంతా 2018–2021లో వివిధ స్పెషలైజేషన్లలో పీజీ పూర్తి చేశారు.

ప్రభుత్వ దవాఖాన్లలో ఏడాది పాటు సీనియర్ రెసిడెంట్లుగా పనిచేసేందుకు గతేడాది నవంబర్‌‌‌‌లో వీరిని సర్కార్ నియమించుకుంది. నెలకు రూ.80,500 చొప్పున వేతనం చెల్లిచాల్సి ఉండగా, కిందటేడు నవంబర్ నుంచి మార్చి వరకు శాలరీ ఇవ్వలేదు. దీంతో మార్చిలో డాక్టర్లు ఆందోళనకు దిగడంతో కొంత మందికి ఐదు నెలల జీతాలు, కొంత మందికి మూడు నెలల జీతాలు చెల్లించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పటి దాకా వేతనాలు ఇవ్వలేదు. దీంతో మరోసారి విధుల బహిష్కరణకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు. స్పెషలైజేషన్ పూర్తి చేసి ఇలా ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడం, కుటుంబ అవసరాల కోసం ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తుండడం ఇబ్బందికరంగా ఉందని డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై మంత్రి హరీశ్‌‌రావుకు మంగళవారం లేఖ రాశామని సీనియర్ రెసిడెంట్స్‌‌ డాక్టర్స్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.