హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్ అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలకు గ్రూప్-1 అధికారులను నియమించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనపై వైద్య వర్గాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. శనివారం తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోషియేషన్(టీజీజీడీఏ), తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ), హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ పరిపాలన కంటే భిన్నమైందని వైద్య సంఘాలు పేర్కొన్నాయి.
ఇది నేరుగా పేషంట్ల ప్రాణాలు, ఎమర్జెన్సీ సేవలు, ఇన్ఫెక్షన్ కంట్రోల్ వంటి కీలక అంశాలతో ముడిపడి ఉంటుందని గుర్తుచేశాయి. కేవలం అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉన్న గ్రూప్ ఆఫీసర్లకు మెడికల్ నాలెడ్జ్, క్లినికల్ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉండదని, దీనివల్ల అత్యవసర సమయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించాయి. ఇప్పటికే హాస్పిటల్స్ లో ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన నిపుణులైన డాక్టర్లు ఉన్నారని, వారి సేవలను వాడుకోవాలని సూచించాయి.
ద్వంద్వ పరిపాలనతో గందరగోళం..
బయటి అధికారులను అడ్మినిస్ట్రేటర్లుగా నియమించడం వల్ల హాస్పిటల్స్ లో రెండు అధికార కేంద్రాలు ఏర్పడతాయని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల కమాండ్ చైన్ దెబ్బతిని, సూపరింటెండెంట్ల అధికారం నామమాత్రంగా మారుతుందని పేర్కొన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరిగి, అది నేరుగా రోగులకు అందే సేవలపై ప్రభావం చూపుతుందని టీజీజీడీఏ నేతలు హెచ్చరించారు.
