కరోనా భయం.. డాగ్‌తో డోర్ డెలివరీ చేయిస్తోన్న మినీ మార్కెట్

కరోనా భయం.. డాగ్‌తో డోర్ డెలివరీ చేయిస్తోన్న మినీ మార్కెట్

కొలంబియా: కరోనా మహమ్మారి రోజురోజుకీ విజృంభిస్తుండటంతో కూరగాయలు, నిత్యావసరాల కోసం ప్రజలు మార్కెట్‌కు వెళ్లేందుకు కూడా జంకుతున్నారు. ఇండియాలోనే కాదు వైరస్ కేసులు ఎక్కువగా ఉన్న అమెరికాలోనే ఇదే పరిస్థితి. ఈ టైమ్‌లో కొందరు ఆన్‌లైన్ డెలివరీస్‌పై ఆధారపడుతున్నారు. అయితే కరోనా కారణంగా డెలివరీస్‌ చేయడం కూడా పెద్ద సమస్యగా మారింది. దీనికి కొలంబియాలోని మినీ మార్కెట్ యజమాని ఓ పరిష్కారాన్ని కనిపెట్టాడు. తన దగ్గర ఉన్న కుక్కను కస్టమర్స్‌కు అవసరమైన గ్రాసెరీస్‌ను డెలివరీ చేయడానికి వాడుకుంటున్నాడు.

ఎనిమిదేళ్ల ఆ కుక్క పేరు ఎరోస్. ఈ లాబ్రడాగ్ తన దవడల్లో స్ట్రా బాస్కెట్‌ను పెట్టుకొని కస్టమర్స్‌ ఇళ్లకు వెళ్లి డెలివరీ చేస్తోంది. పొర్వెనిర్ మార్కెట్‌కు వచ్చే కస్టమర్స్‌కు అవసరమైన వెజిటబుట్స్, ఫ్రూట్ ప్యాకేజీలను ఎరోస్ నేరుగా వెళ్లి అందిస్తోంది. ఇందుకు గాను ఎరోస్‌కు కస్టమర్స్ మంచి ట్రీట్‌ (తిండి) అందిస్తుండగా.. పొర్వెనిర్ మార్కెట్ మసాజ్‌ కూడా చేయిస్తోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే ఎరోస్‌కు అడ్రస్‌లు చదవడం తెలీదు. కానీ కస్టమర్స్ పేర్లను అది గుర్తు పెట్టుకుంటుంది. దానికి రీసెంట్‌గా ఎవరైతే ట్రీట్ ఇచ్చారో వారిని అది గుర్తుంచుకుంటుంది. అలాగే కొంత శిక్షణ ఇవ్వడంతో ఆయా కస్టమర్స్ ఇంటికి వెళ్లి సులువుగా డెలివరీ చేస్తోంది.

ఎరోస్ తమకు సోషల్ డిస్టెన్సింగ్ పాటించేందుకు సాయపడుతోందని ఆ డాగ్ ఓనర్ మారియా నత్విదాద్ బొటెరో చెప్పాడు. ఎరోస్‌ను డెలివరీకి పంపినప్పుడు ప్రజలు దాన్ని చాలా ఇష్టపడుతున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఎరోస్‌కు ఐదారుగురు కస్టమర్స్‌ పేర్లు తెలుసు. సరుకుల బాస్కెట్‌లో ధరల రిసిప్ట్‌ను పెట్టి ఎరోస్‌ను వారి ఇళ్లకు పంపుతా. అవి అందిన వెంటనే వారు బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా డబ్బులు చెల్లిస్తారు. ఎరోస్ పెద్ద తిండిబోతు. కస్టమర్స్ దానికి తినడానికి ఏదోటి ఇచ్చేంత వరకు అది వారి ఇళ్ల నుంచి అస్సలు కదలదు’ అని బొటేరో నవ్వుతూ చెప్పాడు.