వెంకన్న మృతిపై శవరాజకీయాలు చేయొద్దు..ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన

వెంకన్న మృతిపై శవరాజకీయాలు చేయొద్దు..ప్రతిపక్షాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
  • వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని వ్యాఖ్య​
  • డీటీవో మృతదేహానికి మంత్రి, పీసీసీ చీఫ్ నివాళులు

హనుమకొండ, వెలుగు: భూపాలపల్లి డీటీవో వెంకన్న మృతిపై శవరాజకీయలు చేయొద్దని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్షాలకు హితవు పలికారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు, జిల్లా అధికారులతో కలిసి మంత్రి పొన్నం సోమవారం హనుమకొండ గాంధీనగర్​లోని ఆయన ఇంట్లో వెంకన్న మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ వెంకన్న మృతిపై నిజానిజాలు తేల్చడానికి జాయింట్ ట్రాన్స్ ఫోర్ట్ కమిషనర్ ను విచారణాధికారిగా నియమించామన్నారు. ప్రత్యక్ష సాక్షులతోపాటు సమగ్ర విచారణ చేపట్టి నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు. ప్రతిపక్ష నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

గతంలో లారీ కింద పడి వ్యక్తి చనిపోతే శవాన్ని మాయం చేసి, సాక్ష్యం చెప్పకుండా కుటుంబాన్ని బెదిరించిన ఘటనలూ  ఉన్నాయని చెప్పారు. నేరెళ్ల ఘటనలో కొందరిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి జీవితాలకు పనికిరాకుండా చేశారని తెలిపారు. మృతుడు వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని, అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు.

డీటీవో మృతిపై ఏమైనా అనుమానాలుంటే విచారణాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. డీటీవో మృతదేహానికి నివాళులర్పించిన వారిలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, కుడా చైర్మన్ వెంకట్రామి రెడ్డి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్, ఆర్డీవో వెంకటేశ్ తదితరులు ఉన్నారు.