జగిత్యాల టౌన్/మల్యాల/కొడిమ్యాల, వెలుగు: జిల్లాలో ప్రతి శాఖ భవిష్యత్ లక్ష్యాలను నిర్దేశించుకోవాలని ఆర్థిక శాఖ స్పెషల్ సెక్రటరీ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జగిత్యాలలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి వివిధ శాఖల 99రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రగతిపై ఆమె రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ, వార్డు సభల దరఖాస్తులపై సమగ్ర నివేదిక రూపొందించాలని, రాబోయే ఆరు నెలల కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. విద్యాశాఖలో జిల్లా సాధించిన ఫలితాలను అభినందిస్తూనే ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు పెంచాలన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 99రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశామన్నారు. విద్యాశాఖలో జిల్లా రాష్ట్రస్థాయిలో 17వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరిందన్నారు. 1,532 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించామని వివరించారు. అంతకుముందు కలెక్టర్‌తో కలిసి మల్యాల మండలం సర్వాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం కొడిమ్యాల మండలకేంద్రంలోని పీహెచ్‌సీని పరిశీలించారు.
పీహెచ్‌సీకి వస్తున్న పేషంట్ల వివరాలు పక్కాగా నమోదు చేయాలని, మెడికల్ క్యాంపులకు వెళ్లే వారి హాజరు శాతాన్ని అప్డేట్ చేయాలన్నారు. పూడూరు గ్రామంలోని హైస్కూల్ సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్, ఏఎస్పీ చేతన్ నితిన్, ఆర్డీవో మధుసూదన్ గౌడ్, హౌసింగ్ పీడీ భాస్కర్, డీపీవో మదన్‌మోహన్, డీఎంహెచ్‌వో సుజాత, సర్పంచులు హనుమంతు, జీవన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
