హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ ట్యాంకర్ల దందా.. వందల కోట్లలో వ్యాపారం

హైదరాబాద్ సిటీలో ప్రైవేట్ ట్యాంకర్ల దందా.. వందల కోట్లలో వ్యాపారం

గ్రేటర్‌‌‌‌ హైదరాబాద్‌‌లో మొత్తం 1,500 ప్రైవేట్ ట్యాంకర్లు నీటి సరఫరా వ్యాపారంలో ఉన్నట్లు తెలుస్తోంది. వీటి ద్వారా ఏటా వేసవిలో రూ.కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఇండ్లు కట్టుకునేవారు, అపార్ట్‌‌మెంట్లు, విల్లాలు, టౌన్‌‌షిప్‌‌లు, హాస్టళ్ల నిర్వాహకులు, కమర్షియల్ యాక్టివిటీస్ చేసేవారు అధికంగా ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నారు. ఈసారి భారీ ఎండలకు చాలా చోట్ల భూగర్భ జలాలు పడిపోయి, బోర్లు ఎండిపోవడంతో నీటి ఎద్దడి పెరిగింది. వెస్ట్ సిటీ మాత్రమే కాకుండా మల్కాజిగిరి, ఎల్బీనగర్, హయత్​నగర్, బోయిన్‌‌పల్లి తదితర ప్రాంతాల్లోనూ నీటి సమస్య తీవ్రమైంది. 

ఆయా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోవడంతో డిమాండ్ పెరిగిందని గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌‌మెంట్ అధికారులే చెప్తున్నారు. వాటర్ బోర్డు ఇప్పటికే రోజుకు 19 వేల నుంచి 20 వేల ట్రిప్పులతో నీటిని సరఫరా చేస్తోంది. పెరుగుతున్న ఒత్తిడి కారణంగా బుక్ చేసిన వెంటనే వాటర్‌‌‌‌ ట్యాంకర్‌‌‌‌ను డెలివరీ చేయలేకపోతున్నారు. దీంతో భవన నిర్మాణదారులు, హాస్టళ్ల నిర్వాహకులు, హోటల్స్, మెస్‌‌లు, టిఫిన్ సెంటర్లు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలోని ఆయా ప్రాంతాల్లో రోజుకు వీరు 6 వేల నుంచి 8 వేల ట్రిప్పులతో నీటి సరఫరా చేస్తున్నారు. 

అక్రమ బోర్లతో నీటిని తోడేస్తున్నరు..

ట్యాంకర్ల బుకింగ్‌‌లు పెరగడంతో ప్రైవేట్ ట్యాంకర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా బోర్లు వేసి, నీటిని తోడేస్తున్నారు. మణికొండ, వట్టి నాగులపల్లి, హిమాయత్​సాగర్, జన్వాడ తదితర ప్రాంతాల్లో జంట జలాశయాలకు సమీపంలో అక్రమంగా బోర్లు వేస్తున్నారు. సాధారణంగా బోర్లు వేయాలంటే రెవెన్యూ అనుమతి తప్పనిసరి. జలాశయాల పరీవాహక ప్రాంతాల్లో బోర్లు వేయడం కూడా నిషిద్ధం. కానీ, కొందరు రాజకీయ నాయకుల అండతో, మరికొందరు పలుకుబడితో బోర్లువేసి కావాల్సినంత నీటిని తోడేస్తున్నారు. 

జలాశయాలు లేని చోట్ల కొందరు పంట పొలాలు, నాలాలు, చెరువుల సమీపంలోనూ, సొంత భూముల్లోనూ బోర్లు వేసుకుని దందా చేస్తున్నారు. వీరి కార్యకలాపాలపై ప్రభుత్వంలోని ఏ శాఖకు కూడా నియంత్రణ లేదు. వాటర్ బోర్డు తమకు సంబంధం లేదని చెప్తుండగా, రెవెన్యూ అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెబుతోంది.