హైదరాబాద్ సిటీలో నీటి సమస్యకు కారణాలు ఇవే ! సర్వేలో బయపడిన సంచలన వాస్తవాలు

హైదరాబాద్ సిటీలో నీటి సమస్యకు కారణాలు ఇవే ! సర్వేలో బయపడిన సంచలన వాస్తవాలు

వెస్ట్ సిటీలోని ఆయా ప్రాంతాల నుంచే భారీ సంఖ్యలో ట్యాంకర్ల బుకింగ్ జరగడంపై వాటర్ బోర్డు అధికారులు ఆరా తీశారు. కూకట్‌‌పల్లి, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, ఐటీ కారిడార్, కొండాపూర్, చందానగర్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో అధికారులు ప్రత్యేక బృందాలతో సర్వే నిర్వహించారు.

ఆయా ప్రాంతాల్లో హైరైజ్ భవనాలు, అపార్ట్‌‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు అధికంగా ఉండడం వల్ల భూగర్భ జలాలు అడుగంటినట్టు గుర్తించారు. ఇతర ప్రాంతాల్లో వెయ్యి అడుగుల మేరకు బోర్లు ఉండగా, ఈ ప్రాంతాల్లో రెండు వేల ఫీట్లు వేసినా నీళ్లు రావడం లేదని చెప్తున్నారు.

ఈ ప్రాంతాల నుంచే గతేడాది రోజుకు వాటర్ బోర్డుకు 80 వేల ట్యాంకర్ల బుకింగ్‌‌లు వచ్చాయి. ఈసారి కూడా అవే ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో బుకింగ్‌‌లు వస్తున్నాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాల్లో ఇంకుడు గుంతల నిర్మాణం కూడా లేనట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు 40 వేల మందికి నోటీసులు జారీ చేసినట్టు మెట్రోవాటర్​బోర్డు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.

వారు ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా కౌన్సెలింగ్ చేశామని, చాలా మంది వాటిని నిర్మించుకుంటున్నారని చెప్పారు. దీని ఫలితాలు వచ్చే వర్షాకాలం తర్వాత తెలుస్తాయని తెలిపారు. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో ఇంకుడుగుంతలు నిర్మించుకోని వారి నుంచి ట్యాంకర్ చార్జీలను రెట్టింపు వసూలు చేసే ప్రతిపాదన ఉందని అధికారులు వెల్లడించారు.