నీట్-యూజీ (NEET-UG) రీ-ఎగ్జామ్‌కు ముందు, టెలిగ్రామ్ యాప్ ద్వారా నకిలీ క్వశ్చన్ పేపర్లు లీక్ చేస్తున్నారనే భయంతో ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలికంగా ఆంక్షలు విధించిన సంగతి మీకు తెలిసిందే. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇచ్చిన సిఫార్సుల వల్లే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కట్ చేస్తే.. ప్రభుత్వం టెలిగ్రామ్‌ను ఆపిన తరువాత రోజే అంటే జూన్ 17న ఇండియన్లు టెలిగ్రామ్ వాడటానికి, ఇతర ప్రత్యామ్నాయాల కోసం VPN (వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్) యాప్‌లను విపరీతంగా డౌన్‌లోడ్ చేయడం స్టార్ట్ చేశారు.
రికార్డు స్థాయిలో పెరిగిన యాప్ డౌన్‌లోడ్స్:
జూన్ 17 ఒక్కరోజే ఇండియాలో టాప్ 100 VPN యాప్‌లను 9 లక్షల 19 వేల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. 2026లో ఒకే రోజు ఈ స్థాయిలో డౌన్‌లోడ్స్ జరగడం ఇదే మొదటిసారి. ప్రోటాన్ VPN డౌన్‌లోడ్స్ 157% పెరగ్గా, టర్బో VPN డౌన్‌లోడ్స్ డబుల్ అయ్యాయి.
టెలిగ్రామ్‌కు లింక్ అయి ఉండే టెలిగ్రామ్ X యాప్ డౌన్‌లోడ్స్ 6,509%, iMe యాప్ డౌన్‌లోడ్స్ ఏకంగా 22,018% పెరిగాయి. పర్సనల్ మెసేజింగ్ యాప్ సిగ్నల్ (Signal) డౌన్‌లోడ్‌లు కూడా 571% పెరిగాయి.
దీనిపై ఎవరెమంటున్నారంటే
స్టూడెంట్స్ సపోర్ట్: పరీక్షల టైమ్‌లో తప్పుడు వార్తలు, లీక్ వదంతులు రాకుండా ఉండటానికి టెలిగ్రామ్‌ను ఆపడం మంచిదే. కానీ ప్రభుత్వం కేవలం యాప్‌లను ఆపడం కాకుండా, అసలు పేపర్లు లీక్ చేసే ముఠాలను పట్టుకోవాలి " అని ఢిల్లీ, ఇండోర్ విద్యార్థులు అన్నారు. మిగతా సోషల్ మీడియా యాప్స్‌పై కూడా నిఘా పెట్టాలని కోటా విద్యార్థులు కోరారు.
నిపుణుల విమర్శలు: ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ (IFF) మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పుబట్టింది. ఇలా యాప్‌లను పూర్తిగా ఆపేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని, కాస్త టెక్నాలజీ తెలిసిన వాళ్లెవరైనా VPNలు, వేరే యాప్స్ వాడుకుని పని కానిచ్చేస్తారని పేర్కొంది.
చివరగా.. ఆన్‌లైన్‌లో ఏవైనా ఆంక్షలు పెట్టినప్పుడు జనాలు ఊరికే కూర్చోకుండా వెంటనే టెక్నాలజీ సాయంతో వేరే దారులు వెతుక్కుంటారని ఈ డేటా చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా, టెలిగ్రామ్ వాడేవాళ్లు మాత్రం దాన్ని వదులుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు.
