బైక్ స్టంట్లు చేస్తూ రీల్స్, సోషల్ మీడియా పోస్టులు... ఆదిలాబాద్ జిల్లాలో యువకులపై కేసు..

బైక్ స్టంట్లు చేస్తూ రీల్స్, సోషల్ మీడియా పోస్టులు... ఆదిలాబాద్ జిల్లాలో యువకులపై కేసు..

యువతలో రీల్స్ లో పిచ్చి రోజురోజుకీ ముదిరిపోతోంది. ఓవర్ నైట్ ఫేమ్ కోసం ప్రాణాలను కూడా లెక్కచేయకుండా రీల్స్ చేస్తున్నారు చాలామంది. హైదరాబాద్ లో బైక్ స్టంట్స్ చేస్తున్నవారిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ బైక్ స్టంట్స్ పిచ్చి జిల్లాలకు కూడా చేరింది. పట్టణాలు, గ్రామాల్లో కూడా యువకులు బైక్ స్టంట్స్ చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అలా ఆదిలాబాద్ లో బైక్ స్టంట్స్ చేస్తూ వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు.

ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు యువకులు రోడ్లపై ప్రమాదకరంగా బైక్ స్టంట్లు, వీలింగ్‌లు నిర్వహిస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు పోలీసులు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, సోషల్ మీడియా మానిటరింగ్ ఆధారంగా సంబంధిత వ్యక్తులను గుర్తించి మోటార్ వాహనాల చట్టంలోని నిబంధనల మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు పోలీసులు. యువకుల నుండి స్కూటీ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు.

ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేసే వారు తమ ప్రాణాలతో పాటు ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు కలిగిస్తున్నారని అంటున్నారు పోలీసులు.బైక్ స్టంట్లు, వీలింగ్‌లు, అతివేగంగా వాహనాలు నడపడం, వాటి వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రత, బాధ్యతాయుతమైన డ్రైవింగ్, సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ప్రయాణించాలని, రోడ్లను స్టంట్ల కోసం కాకుండా సురక్షిత రవాణా కోసం మాత్రమే ఉపయోగించాలని కోరారు.