- రెండు వేల కోట్లతో రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి
- సనాతన ధర్మాన్ని కాపాడడానికి రేవంత్ ప్రత్యేక చొరవ
- కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు
కొండగట్టు,వెలుగు: రాష్ట్రంలోని అన్ని దేవాలయాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల కోట్లు కేటాయించిందని, త్వరలోనే పనులు చేపడతామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం తన అనుచరులతో కలిసి కొండగట్టు అంజన్నను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం భేతాళుని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధి కోసం రెండు వేల కోట్లు కేటాయించిందని తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఓ వైపు సంక్షేమం, మరో వైపు అభివృద్ధి నిరాటంకంగా జరగాలని అంజన్నను వేసుకున్నట్లు తెలిపారు.
బాసర నుండి భద్రాచలం వరకు ఆలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఆయా నియోజక వర్గాల ఎమ్మెల్యేల కోరిక మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ఆలయాల అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. శృంగేరి పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతి, చిన్న జీయర్ స్వామి వారి సలహాలు, సూచనలతో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.
