అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం... ఇద్దరు కార్మికులు మృతి..

అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం... ఇద్దరు కార్మికులు మృతి..

ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదంజరిగింది. జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ( జూన్ 23 ) ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో వేగంగా మంటలు వ్యాపించడంతో పలువురు కార్మికులు ఫ్యాక్టరీలోనే చిక్కుకుపోయారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో దట్టమైన పొగ ఫ్యాక్టరీ పరిసరాలను కమ్మేసింది. దీంతో సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు కూడా రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం సహాయక చర్యలు మరింత వేగంగా చేపట్టాలని ఆదేశించింది. 

క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు మంత్రి అనిత. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మంత్రి అనిత.