హైదరాబాద్: హైదరాబాద్లో మరోసారి ఏసీబీ సోదాలు జరిగాయి. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి నివాసంలో ఏసీబీ తనిఖీలు జరిగాయి. ఆదాయానికి మించిన అక్రమ ఆస్తుల కేసులో భాగంగా ఈ తనిఖీలు చేశారు. మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన బంధువులు సన్నిహితుల నివాసాల్లో మొత్తం పది చోట్ల తెల్లవారుజాము నుంచి ఏసీబీ రైడ్స్ కొనసాగుతున్నాయి.
మచ్చ బొల్లారంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు చేశారు. నిజామాబాద్కు చెందిన ఏసీబీ అధికారులు మచ్చ బొల్లారంలో నివాసం ఉంటున్న సూపరిండెంట్ మల్లారెడ్డి ఇంట్లో సోదాల చేశారు. నిజామాబాదులోని ఆయన నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ మల్టీజోన్-–2 డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి రావు అక్రమాస్తుల కేసు ఇటీవల తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. తవ్విన కొద్దీ లెక్క లేనన్ని ఆస్తులు బయటపడ్డాయి. దర్యాప్తులో భాగంగా పాతబస్తీ శాలిబండ కెనరా బ్యాంక్‌లోని రెండు లాకర్లు ఓపెన్ చేసిన ఏసీబీ అధికారులు.. ఒక దాంట్లో నోట్ల కట్టలు, మరొక దాంట్లో రెండున్నర కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చూసి అవాక్కయ్యారు.
నరహరితోపాటు ఆయన భార్య పేరిట ఉన్న జాయింట్ అకౌంట్ లాకర్‌లో రూ.1.5 కోట్ల నగదు, భార్య లాకర్‌లో ఒక్కొక్కటి100 గ్రాముల బరువున్న 12 బంగారు బిస్కెట్లు సహా మొత్తం 2,600 గ్రాముల బంగారం, వజ్రాభరణాలను సీజ్ చేశారు.
నరహరి ఇళ్లలో జరిపిన సోదాల్లో ఇప్పటికే రూ.1.54 కోట్ల నగదు సహా మొత్తంగా రూ.13.5 కోట్ల విలువైన ఆస్తులను ఏసీబీ గుర్తించిన సంగతి తెలిసిందే. కాగా లాకర్లలో గుర్తించిన నగదు, బంగారంతో అధికారిక లెక్కల ప్రకారం రూ.17 కోట్లకు పైగా నరహరి రావు ఆస్తులు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ.200 కోట్లకు పైగా ఉంటుంది.
