యూఎస్ అధ్యక్షుడిగా ఎంతో డబ్బు నష్టపోయాను

యూఎస్ అధ్యక్షుడిగా ఎంతో డబ్బు నష్టపోయాను
  • అమెరికాలో ఎమర్జెన్సీ విధింపుపై ట్రంప్ సంకేతాలు

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ ఆర్థికంగా ఎంతో నష్టపోయానని చెప్పారు డొనాల్డ్ ట్రంప్. ఆర్థికంగా భారీగా నష్టపోయిన వ్యక్తుల్లో ఇప్పుడు తాను కూడా ఒకడినని ఆయన అన్నారు. అధ్యక్ష పీఠం అడ్డుపెట్టుకుని అక్రమంగా డబ్బు కూడబెడుతున్నారన్న ఆరోపణలకు సమాధానమిచ్చిన ట్రంప్… ఆ ఆరోపణలను తప్పుపట్టారు.

మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించేందుకు, అమెరికాలో ఎమర్జెన్సీ విధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా సంకేతాలు ఇచ్చారు ప్రెసిడెంట్ ట్రంప్. ఈ విషయంలో డెమొక్రాట్స్ తో చర్చలు కొలిక్కివచ్చేలా లేవనీ… టైమ్ వేస్ట్ అవుతోందని చెప్పారాయన.
తన హోటల్ లో ఉంటున్న దౌత్యవేత్తల నుంచి ‘గిఫ్టులు’ తీసుకుంటూ… అమెరికా రాజ్యాంగంలోని ప్రతినిధుల నిబంధనను ట్రంప్ అతిక్రమిస్తున్నారంటూ విమర్శకులు ఆరోపిస్తున్నారు. దీనిపై న్యూయార్క్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
“ప్రెసిడెంట్ గా ఉంటూ ఎన్నో బిజినెస్ అవకాశాలు వదులుకున్నా. ఈ పనిచేస్తూ భారీస్థాయిలో డబ్బును నష్టపోయా. అదృష్టవశాత్తూ నాకు డబ్బుతో పనిలేదు” అన్నారు. మెక్సికో వాల్ విషయంలో మరో షట్ డౌన్ ఉండకపోవచ్చు అని ట్రంప్ చెప్పారు. మిలటరీ ఫండింగ్ తో గోడ కడతానంటూ… ట్రంప్ అమెరికాలో ఎమర్జెన్సీ ప్రకటించే సంకేతాలను ఇచ్చారు.