అయోధ్య విరాళాల దోపిడీని రాజకీయం చేయొద్దు... పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచన

అయోధ్య విరాళాల దోపిడీని రాజకీయం చేయొద్దు... పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ: అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల అంశాన్ని రాజకీయం చేయొద్దని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఆలయ ట్రస్ట్ ఆర్థిక లావాదేవీలపై ఆడిట్ నిర్వహించాలని, మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జాయ్‌‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి. మోహనలతో కూడిన బెంచ్‌‌ విచారణ జరిపింది. 

సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ, ఈ ఆరోపణలపై యూపీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేటస్ రిపోర్టును సమర్పించామని తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. దీనిపై స్పందించిన సీజేఐ సూర్యకాంత్.. దర్యాప్తు నిష్పాక్షికంగా, పారదర్శకంగా సాగి తుది నిర్ణయానికి చేరుకోవాలని సూచించారు. ‘‘ఈ అంశం.. నేరం జరిగిందా లేదా అన్న కోణంలో విచారణ జరగాల్సినది మాత్రమే. దీనికి రాజకీయ రంగు పులమకండి” అని వ్యాఖ్యానించారు. 

విరాళాల లెక్కింపునకు ఎస్‌‌బీఐ బృందం..

రామమందిర విరాళాల దుర్వినియోగం వ్యవహారం వెలుగులోకి వచ్చినందున నగదు విరాళాల లెక్కింపు విధానంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక మార్పులు చేసింది. స్టేట్‌‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌‌బీఐ) పర్యవేక్షణలో రెండు షిఫ్టుల్లో నగదు లెక్కింపును నిర్వహించేందుకు కొత్త బృందాన్ని నియమించింది.