సింగరేణి సంస్థ నిధులను కేసీఆర్ దోచుకుంటున్నారు: కిషన్ రెడ్డి 

సింగరేణి సంస్థ నిధులను కేసీఆర్ దోచుకుంటున్నారు: కిషన్ రెడ్డి 

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ ఉద్యమం టైమ్ లో సింగరేణిని రక్షించుకుందామని నినాదాలిచ్చిన సీఎం కేసీఆర్.. ఇప్పుడు ఆ సంస్థ నిధులను భక్షిస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. మిగులు నిధులు ఉన్న సింగరేణిని అప్పుల ఊబిలోకి నెట్టారని ఫైర్ అయ్యారు. ఈ తొమ్మిదేండ్లలో సింగరేణి స్థితిగతులపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలోని తన ఇంట్లో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ తన రాజకీయ అవసరాల కోసం సింగరేణిని బలి చేయాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు.

సింగరేణి డబ్బులను ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఎలా పెడతారని ప్రశ్నించారు. కార్మికుల కష్టాన్ని దుర్వినియోగం చేస్తే సహించబోమని హెచ్చరించారు. సింగరేణి బొగ్గు గనుల వేలంలో పాల్గొనని తెలంగాణ సర్కార్.. విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్డింగ్ వేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. త్వరలో సింగరేణి ఎన్నికలు రానుండడంతో ప్రధాని మోడీకి వ్యతిరేకంగా కేసీఆర్ కొత్త పల్లవి ఎత్తుకున్నారని ఫైర్ అయ్యారు. ‘కల్వకుంట్ల కుటుంబ పాలన పోవాలి.. కార్మికులకు మేలు జరగాలి’ అనే నినాదంతో ముందుకువెళ్తామన్నారు. 

టర్నోవర్ పెరిగినా లాభాలేవీ? 

తెలంగాణ ఏర్పడినపుడు రూ.3,500 కోట్ల మిగులు నిధులున్న సింగరేణి.. ఈ ఏడాది జనవరి నాటికి రూ.10 వేల కోట్ల అప్పుల్లో కూరుకుపోవడానికి కారణాలేంటో రాష్ట్ర సర్కారు ప్రజలకు చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సింగరేణి టర్నోవర్ పెరుగుతున్నా, లాభాలు ఎందుకు పెరగడం లేదని ప్రశ్నించారు. ‘‘సింగరేణి కన్నా 10 రెట్లు పెద్దదైన కోల్ ఇండియాకు రూ.12 వేల కోట్ల అప్పులుంటే.. సింగరేణికి రూ.10 వేల కోట్లు అప్పులున్నాయి. సంస్థ ఎదుర్కొంటున్న పరిస్థితులకు ఇదే నిదర్శనం. కోల్ ఇండియాలో ప్రతి కార్మికుడికి రోజు రూ.930 చెల్లిస్తుంటే, సింగరేణిలో రూ.430 చెల్లిస్తున్నారు” అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణిని నష్టాలపాలు చేస్తూ.. కేంద్రం ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తోందంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు.