- మొత్తం మూడు విడతల్లో 1.56 లక్షల అడ్మిషన్లు
హైదరాబాద్, వెలుగు: డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ‘దోస్త్’ మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఇప్పటి వరకు 93,516 మందికి సీట్లు అలాట్ అయ్యాయి. ఈ మేరకు దోస్త్ సీట్ల అలాట్మెంట్ వివరాలను హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ వి. బాలకిష్టారెడ్డి, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన గురువారం రిలీజ్ చేశారు. సీట్లు పొందిన అభ్యర్థులు జులై 2 వరకూ ఆన్ లైన్‌లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాలని సూచించారు. మరోపక్క, తొలి మూడు విడతల్లో సీట్లు పొంది ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసిన విద్యార్థులందరూ జూన్ 27 నుంచి జూలై 4వ తేదీ లోపు సంబంధిత కాలేజీలకు వెళ్లి నేరుగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని బాలకిష్టారెడ్డి చెప్పారు.
మూడు విడతల్లో 1.56 లక్షల అడ్మిషన్లు
దోస్త్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 780 డిగ్రీ కాలేజీలు ఉండగా, 3,70,509 సీట్లున్నాయి. మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసే సమయానికి మొత్తం 1,56,531 మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పొందారు. కోర్సుల వారీగా చూస్తే ఈ ఏడాది కూడా కామర్స్ హవా కొనసాగుతోంది. మొత్తం అడ్మిషన్లలో బీకామ్ లో అత్యధికంగా 52,167 మంది చేరారు. ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్‌లో 34,194 మంది, బీఎస్సీ లైఫ్ సైన్సెస్‌లో 28 వేలు మంది, బీఏలో 22,704 మంది, బీబీఏలో 11,969 మంది, బీఎస్సీ గ్రూపులో2,059 మంది చేరారు.
సర్కారీ ‘అటానమస్’ కాలేజీలకే జై..
రాష్ట్రంలోని డిగ్రీ ప్రవేశాల్లో సర్కారు అటానమస్ కాలేజీల సీట్లు హాట్ కేకుల్లా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 116 సర్కారు కాలేజీల్లో 50,940 సీట్లుంటే.. 26,016 మంది విద్యార్థులు సీట్లు పొందారు. మరోపక్క 36 ప్రభుత్వ అటానమస్ కాలేజీల్లోనే 45,060 సీట్లుంటే, ఏకంగా 39,098 మంది సీట్లు పొందారు. ఇక 580 ప్రైవేట్ కాలేజీల్లో 2,47,040 సీట్లు ఉంటే, 70,471 మంది, ప్రైవేటు అటానమస్ ఐదు కాలేజీల్లో 7,490 సీట్లుంటే 4,612 సీట్లు లభించాయి. మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసినా రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 2,13,978 సీట్లు భర్తీ కాలేదు. సుమారు 58 శాతం సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి.
