సీఎం పాలు పొంగిచ్చినా ఇండ్లు ఇస్తలేరు!

సీఎం పాలు పొంగిచ్చినా ఇండ్లు ఇస్తలేరు!
  • ఇండ్లు కట్టినంక రెండేండ్లకు గత నెల ప్రారంభించిన కేసీఆర్ 
  • అప్పుడు ఆరుగురికే పట్టాలిచ్చి, ఆ తర్వాత ఒక్కరికీ ఇయ్యలే
  • ఇండ్లు 1,320..అర్హులు 4 వేల మందికి పైనే 
  • లబ్ధిదారులను ఎంపిక చేయని అధికారులు 
  • ఆఫీసర్లపై అధికార పార్టీ లీడర్ల ఒత్తిడి.. ఇండ్లిప్పిస్తామని పేదల నుంచి వసూళ్లు 

రాజన్న సిరిసిల్ల, వెలుగు: మంత్రి కేటీఆర్ నియోజకవర్గమైన సిరిసిల్లలో రూ.100 కోట్లతో 1,320 డబుల్ బెడ్​రూమ్ ఇండ్లు కట్టి రెండేండ్లయింది. ఇన్ని రోజులు ‘ఇదిగో ప్రారంభిస్తం.. అదిగో ప్రారంభిస్తం’ అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు జులై 3న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. కాలనీకి కేసీఆర్ నగర్ అని పేరు పెట్టారు. ప్రారంభోత్సవం రోజున కేసీఆర్ ఆరుగురు లబ్ధిదారులకు పట్టాలిచ్చి, వారితో గృహప్రవేశం చేయించి పాలు పొంగించారు. స్వయంగా సీఎం కేసీఆరే ప్రారంభించారు గనుక.. ఇగ తమకు వెంటనే ఇండ్లు వస్తాయని, తామూ పాలు పొంగించుకోవచ్చని పేదలు ఆశించారు. కానీ వారికి ఎదురుచూపులే మిగిలాయి. సీఎం ప్రారంభించి దాదాపు రెండు నెలలైనా మిగిలిన ఇండ్లను పంపిణీ చేయలేదు. అర్హుల లిస్టు ఇంకా ఫైనల్ కాలేదని, సర్వే కొనసాగుతోందని అధికారులు చెబుతున్నారు. రెండేండ్లుగా ఇదే మాట చెప్పిన ఆఫీసర్లు.. ప్రారంభోత్సవం జరిగినంక కూడా అలాగే చెప్తుండడంపై పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ లీడర్ల జోక్యంతోనే లిస్టు ఫైనల్ కావట్లేదనే విమర్శలు వస్తున్నాయి. 

సిరిసిల్ల నియోజకవర్గంలోని తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులో రూ.76.30 కోట్ల అంచనా వ్యయంతో 2017లో డబుల్​బెడ్​రూమ్ ఇండ్ల నిర్మాణం ప్రారంభించారు.  జీ ప్లస్​టు మోడల్​లో మొత్తం1,320 ఇండ్లతో గేటెడ్ కమ్యూనిటీ తరహా కాలనీ నిర్మించారు. నిర్మాణాలన్నీ పూర్తయ్యే సరికి ఖర్చు రూ.100 కోట్లకు చేరింది. 2019లోనే నిర్మాణాలు పూర్తి కాగా, సౌలతులన్నీ కల్పించి కలర్లు కూడా వేశారు. కానీ అప్పటి నుంచి ప్రారంభోత్సవం వాయిదా వేస్తూ వచ్చారు. 

అర్హులు 4 వేల మందికి పైనే.. 

డబుల్ బెడ్​రూమ్ ఇండ్ల కోసం సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో 7,300 మంది అప్లై చేసుకున్నారు. ఈ అప్లికేషన్ల ఆధారంగా ఆఫీసర్లు రెండు, మూడు దశల్లో ఫీల్డ్​సర్వే చేసి 4 వేల మందికి పైగా అర్హులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇండ్లు 1,320 మాత్రమే ఉండడంతో అర్హుల నుంచి డిమాండ్​ పెరిగింది. దీంతో అధికార పార్టీ లీడర్లు రంగప్రవేశం చేశారు. తమ అనుచరులు, మద్దతుదార్ల పేర్లు ఫైనల్ లిస్టులో ఉండేలా ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ఈ క్రమంలో అర్హుల లిస్టుపై తరుచూ అభ్యంతరాలు చెబుతుండడంతో మళ్లీ మళ్లీ సర్వే చేయాల్సి వస్తోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఫైనల్​లిస్టును ప్రకటిస్తే ఇండ్లు దక్కని వాళ్లంతా ఆందోళనకు దిగే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడు  విడతల్లో మిగిలిన వాళ్లకు కూడా డబుల్​బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇవ్వడమా? లేదంటే సొంత జాగలు ఉన్న వాళ్లకు రూ.5లక్షల స్కీమ్​ వర్తింపజేయడమా? అనే అంశాన్ని ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు. 

8 మంది కౌన్సిలర్లపై కేటీఆర్ కు ఫిర్యాదులు

లబ్ధిదారుల ఎంపిక కొలిక్కి రాకపోవడంతో, ఇదే చాన్సని అధికార పార్టీ లీడర్లు కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. టీఆర్ఎస్ కౌన్సిలర్లు ఇండ్లు ఇప్పిస్తామని పేదల నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 వేలు మొదలు రూ.లక్ష దాకా వసూలు చేస్తున్నారు. డబ్బులు తీసుకొని, వాళ్ల పేరు ఫైనల్ లిస్టులో ఉండేలా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.ఈ క్రమంలో 8 మంది కౌన్సిలర్లపై మంత్రి కేటీఆర్ కు ఫిర్యాదులు కూడా అందాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేటీఆర్.. థర్డ్​పార్టీ ఎంక్వైరీకి ఆదేశించినట్లు తెలిసింది. ఇలా ఎంక్వైరీలు, రీసర్వేలతో లబ్ధిదారుల ఎంపిక పూర్తికాకపోవడంతో.. పేదలు అద్దె ఇండ్లలోనే ఉండాల్సి వస్తోంది. మంత్రి కేటీఆర్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఇండ్ల పరిస్థితే ఇలా ఉంటే.. ఇక మిగిలిన జిల్లాల్లో ఇండ్ల కేటాయింపు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్ లీడర్ల జోక్యంతోనే రాష్ట్రమంతటా లబ్ధిదారుల ఎంపిక జరగడం లేదని, ప్రభుత్వం స్పందించి అర్హులకు ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఇద్దరు పిల్లలతో ఒక్క రూమ్​లో..  

మాది సిరిసిల్ల పట్టణంలోని ప్రగతినగర్. మా ఆయన సాంచెలు నడిపితే, నేను బీడీలు చేస్త. మాకు సొంతిల్లు లేక కిరాయికి ఉంటున్నం. ఇద్దరు పిల్లలతో ఒకే గదిలో ఉంటూ ఇబ్బంది పడుతున్నం. డబుల్​ బెడ్​రూమ్ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకున్నం. ఇండ్లు పూర్తయినా ఇంకా ఇస్తలేరు. వెంటనే  కేటాయిస్తే మాలాంటి వాళ్లకు నెలనెలా కిరాయి​ కట్టే బాధలు తప్పుతయి.  
- పిస్క అనిత, సిరిసిల్ల

మళ్లీ సర్వే చేస్తున్నం.. 

సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం 7,300 అప్లికేషన్లు వచ్చాయి. ఇప్పటికే సర్వే చేసి అర్హులను గుర్తించాం. అయితే ఫైనల్​లిస్టులో ఉన్న కొందరు గతంలో ఇందిరమ్మ ఇండ్లు తీసుకున్నట్లు మా దృష్టికి రావడంతో మళ్లీ సర్వే చేస్తున్నం. వీలైనంత త్వరగా లబ్ధిదారులను ఎంపిక చేస్తం. 

- వి.సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల 

పేదలందరికీ ఇయ్యాలె.. 

కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో పేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి. ఇప్పటికే రెండేండ్లు వాయిదా వేసిన అధికారులు.. సీఎం ప్రారంభించినంక కూడా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు. వెంటనే లబ్ధిదారులను ఎంపిక చేయకపోతే, ఆందోళనలు చేస్తాం.  

- మూషం రమేశ్, 
సీఐటీయూ నాయకులు, సిరిసిల్ల 

కిరాయి ఇంట్లఇబ్బంది పడ్తున్నం.. 

సీఎం వచ్చి పాలు పొంగిచ్చి పోతే ఇల్లు వస్తదని సంబురపడినం. ఇప్పటిదాకా ఇల్లు రాక దివ్యాంగురాలైన బిడ్డతో కష్టపడుతున్నం. నెలనెలా ఇంటి అద్దె కట్టలేకపోతున్నం. ఏండ్లు గడుస్తున్నా ఇల్లు ఇస్తలేరు. 
 - వెంగల రమ, సిరిసిల్ల

ఇంటి జాగ లేదు 

సిరిసిల్లలో సీఎం డబుల్​ బెడ్రూం ఇండ్లు ప్రారంభించినా మాకు ఇల్లు రాలే.  జాగ గజం కూడా  లేదు. కూలి పని చేసుకుంటేనే మేం బతికేది. ఇంటి కిరాయిలు కట్టలేకపోతున్నం. 
- గజ్జెల్లి సంధ్య, సిరిసిల్ల 

లిస్టులో పేరున్నా ఇస్తలేరు

మేం డబుల్​బెడ్ రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేస్కున్నం. అర్హుల లిస్టులో మా పేరు కూడా వచ్చింది. కానీ ఇంకా ఇల్లు ఇస్తలేరు. చాలా ఏండ్ల నుంచి కిరాయికే ఉంటున్నం. సర్కారు తొందరగా ఇల్లు కేటాయిస్తే మాకు అద్దె బాధలు తప్పుతయి. 
- క్యాతం సునీత, సిరిసిల్ల