
- హైకమాండ్‌దే తుది నిర్ణయమన్న రేవంత్!
- ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఫాలో కావాలంటున్న లీడర్లు
- కొత్తగా చేరేవాళ్లదీ అదే పరిస్థితి
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్‌లో డబుల్ టికెట్ల లొల్లి నడుస్తున్నది. ఒకే కుటుంబంలో రెండు టికెట్ల కోసం లీడర్లు పట్టుబడుతున్నారు. తమతో పాటు తమ వారుసుడు లేదా ఇంట్లో వాళ్లకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పార్టీలోని కొందరు నేతలు మాత్రం ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుతున్నారు. రెండు టికెట్లు ఆశిస్తున్న వారిలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ సీఎల్పీ లీడర్ జానారెడ్డి ముందు వరుసలో ఉన్నారు. తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నారు. మంగళవారం జరిగిన ప్రచార్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) మీటింగ్‌లోనూ పలువురు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు ఇదే విషయంపై చర్చించారు. అది ఎన్నికల కమిటీ పరిధిలో లేదని, హైకమాండ్ పరిధిలోనే ఉందంటూ రేవంత్ చెప్పారని తెలిసింది. ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తాను, తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ఓపెన్‌గానే ప్రకటించారు. తన ఇద్దరు కొడుకులు రఘువీర్ రెడ్డి, జైవీర్‌రెడ్డికి టికెట్లు ఇవ్వాలని జానారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి ఈసారి ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. ఆ నియోజకవర్గం నుంచి రఘువీర్, జైవీర్‌రెడ్డి అప్లికేషన్ కూడా ఇచ్చారు. అదేవిధంగా మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసేందుకు రఘువీర్ అప్లికేషన్ పెట్టుకున్నారు.
పినపాక నుంచి కొడుకు కోసం సీతక్క
ములుగు నుంచి సీతక్క పోటీకి దిగుతుండగా.. పినపాక నుంచి తన కొడుకు సూర్యానికి టికెట్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్నట్టు టాక్. పోరిక బలరాం నాయక్.. తన కొడుకు సాయి శంకర్‌కు టికెట్ డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. సాయి శంకర్ ఇల్లందు నుంచి దరఖాస్తు అందజేశారు. ఇటు కొండా సురేఖ దంపతులూ టికెట్ రేసులో నిలబడ్డారు. వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ అప్లై చేసుకోగా.. పరకాల నుంచి ఆమె భర్త కొండా మురళి అప్లికేషన్ ఇచ్చారు. తన కూతురు త్రిషకు టికెట్ ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రపోజల్ పెట్టినట్టు తెలిసింది. తనకూ, తన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్‌కు టికెట్ ఇప్పించేందుకు అంజన్ కుమార్ యాదవ్ ప్రతిపాదించినట్టు సమాచారం.
ఇతర పార్టీల్లోంచి వచ్చేటోళ్లదీ అదే డిమాండ్
బీఆర్ఎస్లో ఉండి.. కాంగ్రెస్‌లో చేరాలనుకునేవాళ్లు కూడా రెండు టికెట్లు డిమాండ్ చేస్తున్నారు. ఖానాపూర్ టికెట్‌కు అప్లై చేసుకున్న రేఖా నాయక్.. ఇదే విషయంపై పార్టీ పెద్దలతో చర్చించారు. ఆసిఫాబాద్ నుంచి ఆమె భర్త శ్యామ్ నాయక్ అప్లై చేసుకున్నారు. ఇద్దరికీ టికెట్ ఇవ్వాలని రేఖా నాయక్, శ్యామ్ నాయక్ కోరుతున్నారు. మైనంపల్లి హన్మంత రావు.. తన కుమారుడు రోహిత్‌కు కూడా టికెట్ అడుగుతున్నారు. మల్కాజిగిరి తనకిస్తే.. మెదక్ నుంచి తన కొడుకు రోహిత్‌కు స్థానం కన్ఫర్మ్ చేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ సీనియర్లు మాత్రం ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో ఐదేండ్లు సేవ చేయని వాళ్ల కుటుంబాల్లో రెండేసి టికెట్లు ఇవ్వొద్దని, ఎట్టిపరిస్థితుల్లోనూ ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను ఫాలో కావాల్సిందేనని తేల్చి చెప్తున్నారు.