- వైద్య సేవలకు గుర్తింపుగా రెవరెండ్ జెస్సీ ఎల్.జాక్సన్ పురస్కారం
- యూఎస్ కాంగ్రెస్ మెన్ డానీ కె.డేవిస్ చేతుల మీదుగా అవార్డు అందజేత
హైదరాబాద్, వెలుగు: ఐఎంఏ బంజారాహిల్స్ బ్రాంచ్ ప్రెసిడెంట్ డాక్టర్ చల్లగాలి ప్రభుకుమార్ అమెరికాలో ప్రతిష్టాత్మకమైన ‘రెవరెండ్ జెస్సీ ఎల్.జాక్సన్ లీడర్‌షిప్ అవార్డు’అందుకున్నారు. వైద్య రంగంలో ఆయన అందిస్తున్న సేవలను గుర్తిస్తూ యూఎస్ కాంగ్రెస్ మెన్ డానీ కె.డేవిస్, నేషనల్ అమెరికన్ మల్టీ-ఎత్నిక్ కమిషన్(ఎన్‌ఎఫ్‌ఏఎంఈసీ), గ్లోబల్ ఐ మ్యాగజైన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేశాయి. కాగా, లాస్ వేగాస్‌లో జరిగిన ‘హెల్త్ 2.0’ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్‌లో డాక్టర్ ప్రభు కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ‘హెల్త్ కేర్ ఏఐ: ఎన్‌హాన్సింగ్ అవుట్ కమ్స్ త్రూ ఇంటెలిజెన్స్’అనే అంశంపై ఆయన ప్రసంగించారు. వైద్య రంగంలో ఏఐ వాడకం ద్వారా రోగులకు మెరుగైన చికిత్స ఎలా అందించవచ్చనే అంశాలను వివరించారు. డాక్టర్ ప్రభు కుమార్ ప్రస్తుతం లండన్‌లోని కామన్వెల్త్ మెడికల్ అసోసియేషన్ (సీఎంఏ)లో ‘ఏఐ అండ్ సైంటిఫిక్ డిజిటల్ హెల్త్ కమిటీ’కన్వీనర్‌గా, క్లైమేట్ చేంజ్ గ్లోబల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆయన సాధించిన ఈ అంతర్జాతీయ గుర్తింపు పట్ల ఐఎంఏ బంజారాహిల్స్ బ్రాంచ్ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

