న్యూఢిల్లీ: ఫార్మా ప్రొడక్టులు తయారు చేసే హైదరాబాద్ కంపెనీ డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ నికర లాభం (కన్సాలిడేటెడ్) జూన్‌తో ముగిసిన మొదటి క్వార్టర్లో గత ఏడాదితో పోలిస్తే 69 శాతం తగ్గి రూ.434.8 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు సంవత్సరం ఇదే క్వార్టర్లో కంపెనీ రూ.1,409.6 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
సెమాగ్లుటైడ్ ఇంగ్రీడియంట్స్ సమస్య కారణంగా ఏర్పడిన అదనపు ప్రొవిజన్లు, ఉత్తర అమెరికా మార్కెట్లో జనరిక్స్ ఆదాయం గణనీయంగా తగ్గడం ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలు. ఆదాయం కూడా రూ.8,070.5 కోట్లకు పరిమితమైంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ.8,545.2 కోట్ల ఆదాయం వచ్చింది. తాజా క్వార్టర్లో మొత్తం ఖర్చులు రూ.3,375.6 కోట్లకు చేరాయి.
సెమాగ్లుటైడ్ ఏపీఐకి సంబంధించి నాణ్యతా లోపాలు తలెత్తడంతో రూ.239.7 కోట్లు ప్రొవిజన్ చేయాల్సి వచ్చింది. ఉత్తర అమెరికాలో జనరిక్స్ ఆదాయం 35 శాతం క్షీణించగా, భారతదేశంలో మాత్రం 17 శాతం వృద్ధి కనిపించింది. కంపెనీ గ్లోబల్ జనరిక్స్ ఆదాయం ఐదు శాతం తగ్గి రూ.7,199.3 కోట్లకు పడిపోయింది.
కంపెనీ కో –చైర్మన్ జీవీ ప్రసాద్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో పెప్టైడ్స్, బయోసిమిలర్స్ రంగాలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా బేస్ బిజినెస్ మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
