ఘట్కేసర్, వెలుగు: గణేశ్ విగ్రహం తరలిస్తుండగా విద్యుత్ షాక్ తగిలి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ సమీపంలో వెహికల్ డ్రైవర్ చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భానుప్రసాద్(28) అశోక్ లేలాండ్ వాహనం నడుపుతూ బతుకుతున్నాడు. సోమవారం రాత్రి ఘన్పూర్ నుంచి అల్వాల్‌కు విగ్రహాన్ని తరలించేందుకు బయలుదేరాడు. మార్గమధ్యలో రోడ్డుపై 11 కేవీ విద్యుత్ తీగలు వేలాడుతుండగా, భాను ప్రసాద్ ఈ విషయాన్ని గణేశ్ ఉత్సవ నిర్వాహకుడు శరత్ యాదవ్‌కు తెలియజేశాడు.
అయినప్పటికీ ముందుకు వెళ్లాలని చెప్పడంతో వెహికల్ ముందుకు తీసుకెళ్లగా, గణేశ్ విగ్రహం హైటెన్షన్ వైర్లకు తగిలింది. ప్రాణభయంతో కిందికి దిగే ప్రయత్నంలో భాను ప్రసాద్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్రగాయాలపాలైన అతడిని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున చనిపోయాడు. మృతుడి తమ్ముడు తరుణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
