- విద్యాసంస్థలు ‘డ్రగ్ ఫ్రీ క్యాంపస్’లుగా మారాలి
- తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ‘డ్రగ్ అబ్యూజ్ అవేర్‌నెస్ వర్క్ షాప్’
హైదరాబాద్, వెలుగు: డ్రగ్స్ వ్యసనం ఒక వ్యక్తి, కుటుంబ సమస్య మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును దెబ్బతీసే సామాజిక దురాచారమని గవర్నర్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ ప్యాట్రన్ శివ్ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. యువతను డ్రగ్స్ బారినపడకుండా కాపాడేందుకు ప్రభుత్వం, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, సమాజం మొత్తం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
శనివారం లోక్‌భవన్‌లోని ‘సంస్కృతి’ కమ్యూనిటీ హాల్‌లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి “డ్రగ్ అబ్యూజ్ అవేర్‌నెస్ వర్క్ షాప్”లో గవర్నర్ శుక్లా ముఖ్య అతిథిగా పాల్గొని, ప్రసంగించారు. యువత ఆరోగ్యవంతంగా, క్రమశిక్షణతో, నైతిక విలువలతో ఎదిగినప్పుడే ‘వికసిత్ భారత్’, ‘వికసిత్ తెలంగాణ’ లక్ష్యాలు సాకారమవుతాయని పేర్కొన్నారు. విద్యాసంస్థల్లో ప్రవేశాల సమయంలో విద్యార్థులతో మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామనే ప్రతిజ్ఞ చేయించాలని సీఎం రేవంత్‌రెడ్డికి సూచించానని, ఆ సూచనను ప్రభుత్వం వెంటనే ఆమోదించి ఈ విద్యాసంవత్సరం నుంచే అడ్మిషన్ ఫారమ్‌లలో ప్రతిజ్ఞను చేర్చినట్టు తెలిపారు.
విద్యాసంస్థలు కేవలం డిగ్రీలు అందించే కేంద్రాలు కాదని, వ్యక్తిత్వ వికాసానికి, విలువల నిర్మాణానికి పునాదులని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలు ‘డ్రగ్ -ఫ్రీ క్యాంపస్’లను అత్యున్నత ప్రాధాన్యతగా తీసుకోవాలని కోరారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు సమాజంలో మార్పు తీసుకురాగల ‘చేంజ్ మేకర్స్’ అని కొనియాడారు. సేవ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలతో యువతను సరైన మార్గంలో నడిపించడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.
పిల్లల్లో ఆకస్మిక మార్పులను గమనించాలి..
పిల్లల ప్రవర్తనలో, చదువులో, స్నేహ సంబంధాల్లో వచ్చే ఆకస్మిక మార్పులను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గమనించాలని గవర్నర్ శివ్‌ప్రతాప్ శుక్లా సూచించారు. పిల్లలతో నిరంతర సంభాషణ కొనసాగిస్తూ, భయంతో కాకుండా ప్రేమ, విశ్వాసంతో వ్యవహరించాలన్నారు. తమ కలలు, ఆశయాలు, జీవిత లక్ష్యాలను క్షణిక ఆనందాల కోసం నాశనం చేసుకోవద్దని యువతకు హితవు పలికారు. తాము మాత్రమే కాకుండా తమ పాఠశాలలు, కళాశాలలు, సమాజాన్ని కూడా మాదక ద్రవ్యాలరహితంగా మార్చేందుకు ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.
సమావేశం ముగిసిన తర్వాత గవర్నర్ ‘ఐ యాం యాంటీ డ్రగ్ సోల్జర్’ పేరుతో ఉన్న సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ స్పెషల్ సీఎస్ దాన కిశోర్, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్య డైరెక్టర్ డాక్టర్ ఈ. నవీన్ నికోలస్,ఈగల్ ఫోర్స్ ఎస్పీ పద్మజ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ మాస్టర్లు, ప్రతినిధులు పాల్గొన్నారు.
