మియాపూర్, వెలుగు: ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మియాపూర్ ఇన్ స్పెక్టర్ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ విశ్వంభర కాలనీ పార్క్ సమీపంలో ఓ వోక్స్ వ్యాగన్ కారులో డ్రగ్స్ విక్రయాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో మంగళవారం మియాపూర్ పోలీస్, మాదాపూర్ ఎస్ఓటీ టీమ్కలిసి దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేసిన నిందితులను వెంబడించి పట్టుకున్నారు.
అనంతరం కారు డాష్ బోర్ట్లోని జిప్‌లాక్ కవర్లో తనిఖీ చేయగా 12.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ లభ్యమయ్యాయి. ముషీరాబాద్‌కు చెందిన బేరి హనుమంతు (27), భూమని మహేశ్ (26)కు చెందిన నిందితులు బెంగళూరులోని ఒక నైజీరియన్ వద్ద తక్కువ ధరకు డ్రగ్స్ కొనుగోలు చేసి నగరంలోని ఐటీ ఉద్యోగులే లక్ష్యంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరితో పాటు డ్రగ్స్ వాడుతున్న కాసం ఆదర్శ్ (28)ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి డ్రగ్స్‌తో పాటు వోక్స్ వ్యాగన్కారు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
