ఫర్జీ వెబ్ సిరీస్ చూసే ఉంటారు కదా.. OTTలో టాప్ రేటింగ్ సిరీస్ ఇది. దొంగ నోట్లు మారుస్తూ.. పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో.. రోడ్లపై డబ్బులను విసిరేస్తూ ఉండే సీన్ ఒకటి ఉంది. సేమ్ టూ సేమ్ అలాగే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్ స్మగ్లర్లు పోలీసుల నుంచి తప్పించుకోవటానికి రోడ్లపై డబ్బులను విసిరిస్తూ బీభత్సం చేశారు. దేశం అవాక్కయ్యేలా జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి....
ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డ్రగ్స్ స్మగ్లర్లు రోడ్డుపై రూ.100 నోట్లను గాల్లోకి విసురుతూ వెదజల్లారు. ఈ ఘటన ఒక హోండా సిటీ కారు స్టాప్ సిగ్నల్స్ కూడా అస్సలు పట్టించుకోకుండా వేగంగా దూసుకెళ్లింది. దాంతో అక్కడ ఉన్న స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) పోలీసులు ఆ కారును వెంబడించారు. చేజింగ్ సమయంలో నేరస్థులు పోలీసుల వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో పోలీసుల వాహనం ఆగిపోయింది.
అదే సమయంలో ప్రదీప్ కుమార్ మోదన్వాల్ అనే స్థానికుడు సమయస్ఫూర్తితో.... తన కారును పోలీసులకు ఇచ్చాడు. దాంతో పోలీసులు మళ్లీ చేజింగ్ మొదలుపెట్టారు.
పోలీసులు వాళ్ళని వెంబడించకుండా వారి దృష్టి మరల్చడానికి స్మగ్లర్లు ఒక ప్లాన్ వేశారు. కారు విండో నుంచి రోడ్డుపైకి వంద రూపాయల నోట్లను గాల్లోకి విసరడం స్టార్ట్ చేసారు. అయినా సరే పోలీసులు వదలకుండా కారును వెంటాడారు. చివరకు పోలీసులు ఆ కారును అడ్డుకోగలిగారు.
పోలీసులు చుట్టుముట్టడంతో స్మగ్లర్లు వారిపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరపడంతో నిందితుల్లో ఒకరైన లుధియానాకు చెందిన ప్రిన్స్ (27) గాయపడ్డాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేయగా.. అతనితో ఉన్న ఇంకొకరు అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
పోలీసులు నిందితుల కారును చెక్ చేయగా.. దాదాపు రూ. 49 లక్షల విలువైన 3 కిలోల నల్లమందు(opium), 225 కిలోల గసగసాల పొట్టు(poppy husk) దొరికాయి. వీటితో పాటు హోండా సిటీ కారు, రూ. 50 వేల నగదు, ఒక నాటు తుపాకీ, బులెట్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వాటన్నింటి మొత్తం విలువ సుమారు రూ. 58.75 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు.
అరెస్ట్ అయిన స్మగ్లర్.. జార్ఖండ్ నుండి పంజాబ్‌కు డ్రగ్స్ సప్లై చేస్తున్నానని, గతంలో కూడా ఇలా చాలాసార్లు చేశానని పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న రెండో నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
