- ఓవర్‌స్పీడ్‌తో రెండు బైక్‌లను ఢీకొట్టిన వైనం
- ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు
కూకట్ పల్లి, వెలుగు: ఓ ప్రైవేట్ కంపెనీ బస్సు డ్రైవర్ మద్యం మత్తులో వాహనాన్ని నడిపి ఒకరి ప్రాణాన్ని బలి తీసుకోగా, మరో ఇద్దరిని ప్రాణాపాయ స్థితికి చేర్చాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో హెటెరో కంపెనీకి చెందిన బస్సు డ్రైవర్ శ్రీనివాసరావు మద్యం మత్తులో అతివేగంగా వచ్చి ఐడీపీఎల్ సమీపంలో రెండు బైక్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నారాయణగూడకు చెందిన వాడ్రేవు మురళీకృష్ణ (46) అక్కడికక్కడే మృతి చెందగా, మరో బైక్‌పై ఉన్న లక్ష్మణ్, బబ్లు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డివైడర్‌ను ఢీకొని మరొకరు
ఫ్రెండ్ బర్త్‌డే పార్టీలో పాల్గొని, అర్ధరాత్రి నగరాన్ని చూసేందుకు ఒకే బైక్‌పై వచ్చిన ముగ్గురు యువకులు ప్రమాదానికి గురయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది మండలానికి చెందిన భరత్ (18), సుభాశ్ (19), వినీత్ (21) గురువారం అర్ధరాత్రి దాటాక బైక్‌పై సిటీకి వచ్చి తిరిగి వెళ్తుండగా, శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో బాలానగర్‌లో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భరత్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి వేర్వేరు హాస్పిటళ్లలో చికిత్స కొనసాగుతోంది.

