తెలంగాణలో వాతావరణం అంతుచిక్కడం లేదు. ఆకాశం నిండా నల్లటి మేఘాలు కమ్ముకుంటున్నా... నేలపై మాత్రం ఒక్క వర్షపు చినుకూ రాలడం లేదు. రాష్ట్రానికి వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసినా... ఆశించిన స్థాయిలో ఎక్కడా వర్షాలు పడటం లేదు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అటు ప్రజలు, ఇటు రైతాంగం తలలు పట్టుకుంటున్నారు.
రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, విస్తరించి నాలుగు రోజులు గడుస్తున్నా... ఇప్పటికీ భారీ వర్షాల జాడ లేదు. దీనికంతటికీ కారణం ఎల్ నినో ఎఫెక్ట్ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ ఎల్ నినో పరిస్థితులు... మన రుతుపవనాల తీవ్రతను దెబ్బతీస్తున్నాయి. ఒకవేళ ఇది సూపర్ ఎల్ నినో గా మారితే... మున్ముందు పరిస్థితులు మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందంటున్నారు అధికారులు.
ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే... కళ్లముందే మేఘాలు వచ్చి వెళ్తున్నా, వర్షం పడేవరకు నమ్మకం లేదని వాతావరణ శాఖ అధికారులే స్వయంగా చెప్తున్నారు. వాతావరణంలో తేమ ఉన్నా, వర్షంగా మారకుండా ఎల్ నినో కండిషన్లు అడ్డుపడుతున్నాయి.
మరోవైపు రుతుపవనాలు వచ్చేశాయని సంబరపడి, సాగుకు సిద్ధమైన అన్నదాతలు ఇప్పుడు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. వరుణ దేవుడు కరుణించి... ఎప్పుడు భారీ వర్షాలు కురుస్తాయా? తమ పొలాలు ఎప్పుడు పచ్చగా మారుతాయా అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని వేచి చూస్తున్నారు.
