వీడియో వైరల్: ఇంత బద్ధకస్తులు ఉంటే దేశం ఇంకేం బాగుపడుద్ది.. రైలులో ఈ మహా తల్లి చేసిన పనికి..

వీడియో వైరల్: ఇంత బద్ధకస్తులు ఉంటే దేశం ఇంకేం బాగుపడుద్ది.. రైలులో ఈ మహా తల్లి చేసిన పనికి..

మన దేశంలో రైలు ప్రయాణాలపై, మరీ ముఖ్యంగా జనరల్ బోగీల్లో ప్రయాణంపై చిన్న చూపు, చులకన భావం ఉంది. బోగీల్లో చీరలతో ఉయ్యాలలు కట్టుకోవడం, గుట్కాలు ఉమ్మేసి రోత చేయడం, బాత్రూమ్స్ను గలీజు చేయడం, నడిచే తొవ్వ లేకుండా దారిలో కూర్చోవడం, పడుకోవడం, తినేసి ఎక్కడివి అక్కడే పడేయడం, దబాయించి సీట్లలో కూర్చోవడం, పల్లీలు తినేసి పొట్టును సీట్ల కిందే పడేయటం.. రైల్వే స్టేషన్ వచ్చినా ఎక్కే వాళ్లకు, దిగే వాళ్లకు అడ్డంగా డోర్ దగ్గర కూర్చోవడం.. ఇలా రైళ్లలో జనరల్ బోగీల్లో కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రైళ్లను అపరిశుభ్రం చేసే ప్రయాణికులు మన దేశంలోని చాలా రైళ్లలో రోజూ కనిపిస్తూనే ఉంటారు. ఈ ఘటన కూడా అలాంటిదే. ఈ మహిళ రైలును రోత చేయడంలో మరో అడుగు ముందుకేసింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by @randomkaand2

పల్లీలు తిని తను కూర్చున్న సీటు కింద పొట్టును నిర్లక్ష్యంగా పడేస్తూ.. అక్కడే నీళ్లతో చేతులు కడుక్కుంటున్న వీడియో వైరల్ అయింది. మన దేశంలో పరిశుభ్రత ఇలాంటి వాళ్ల వల్లే పెద్ద సవాల్గా మారిందని.. భారతీయ రైళ్లలో ఇలాంటి ప్రయాణికులకు కొదవే లేదని నెటిజన్లు నిట్టూరుస్తున్నారు. 

రైళ్లలో ఏవైనా తింటే చేతులు కడుక్కోవడానికి జనరల్ బోగీల్లో కూడా వాష్ బేసిన్ ఉంటుంది. నాలుగు అడుగులు వేసి అక్కడికి వెళ్లి చేతులు కడుక్కోవడానికి కూడా బద్ధకమై.. ఇలా కూర్చున్న సీటు దగ్గరే చేతులు కడుక్కోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇలాంటి వాళ్ల వల్లే ఇండియా డర్టీ కంట్రీ అనే అప ఖ్యాతిని మూటగట్టుకోవాల్సి వస్తుందని నెటిజన్లు సదరు మహిళ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మహిళ తీరును ఆమె కూర్చున్న బోగీలో ఆమె ఎదురుగానే కూర్చున్న ఒక ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో వైరల్ అయింది. 

స్వచ్ఛ భారత్ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వందల కోట్లు ఖర్చు చేసి నెత్తీనోరూ బాదుకుంటుంటే ఇలాంటి వాళ్లు మాత్రం వీలైనంత గలీజు చేస్తూ దేశాన్ని అపరిశుభ్ర స్థితిలోకి నెట్టేస్తున్నారని నెటిజన్లు తిట్టిపోశారు. ఈ ఘటనను చిత్రీకరించిన వ్యక్తి చెప్పిన ప్రకారం.. ఐదు గంటల ప్రయాణం మొత్తం ఆమె అలానే ప్రవర్తించిందని తెలిపాడు.