తెలంగాణ టూర్: మాన్సూన్ లో మన జలపాతాల జోరు... నెక్స్ట్ వీకెండ్ ట్రిప్ కి ప్లాన్ చేసుకోండి..!

 తెలంగాణ టూర్: మాన్సూన్ లో మన జలపాతాల జోరు... నెక్స్ట్ వీకెండ్ ట్రిప్ కి ప్లాన్ చేసుకోండి..!

ఎండాకాలంలో నిశ్శబ్దంగా కనిపించే అడవులు వర్షాల రాకతో పచ్చని పరుపులు కప్పుకున్నట్లుగా మారిపోతున్నాయి. నగర జీవితపు ఒత్తిడికి దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి తెలంగాణలో జలపాతాలు రా రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. కొండ, కోనల మధ్య నుంచి జాలువారే నీటి ధారలు ప్రకృతి ప్రేమికులను  ఆకట్టుకుంటున్నాయి. ఎత్తైన కొండలపై నుంచి పడే జలపాతాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కనువిందు చేస్తాయి. 

జలపాతాలకు నెలవు.. ఉమ్మడి ఆదిలాబాద్. ఈ జిల్లాలో కుంటాల, పొచ్చెర, గాయత్రి జలపాతాల జోరు పర్యాటకులను ఆకట్టుకుంటోంది. తెలంగాణలోనే అత్యంత సుందర జలపాతంగా కుంటాల ప్రసిద్ధి చెందింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ జాతీయ రహదారి నుంచి పచ్చని అడవుల మధ్య వెలసిన కుంటాల ఈ వర్షాకాలంలో పర్యాటకులను ఆకట్టుకుంటోంది. సహ్యాద్రి పర్వత శ్రేణులైన 147 అడుగుల ఎత్తు కొండల నుంచి జాలువారే ఈ జలపాతం వర్షాకాలంలో అద్భుతంగా కనిపిస్తుంది. 

లోతైన లోయల చెంత ఉన్న ఈ జలపాతం దగ్గరకు వెళ్తే చల్లని నీరు పైనుంచి జాలువారుతూ అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.  జాతీయ రహదారి పక్కన బోథ్ సమీపంలో ఉన్న పొచ్చెర దగ్గర రాతి పొరలపై నుంచి ప్రవహించే నీరు మనసును పరవశింపజేస్తుంది. అడవుల మధ్య దాగి ఉన్న గాయత్రి జలపాతం ట్రెక్కింగ్ ప్రియులను విశేషంగా ఆకర్షిస్తుంది.

కనకాయ జలపాతం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఏటూరునాగారం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కనకాయ జలపాతం పర్యాటకుల దృష్టిని ఆకర్షిస్తోంది. కొంగల జలపాతం ములుగు జిల్లా జంగలపల్లె సమీపంలో దట్టమైన అడవుల్లో ఉంది. ఇది 70 అడుగుల ఎత్తైన, వి ఆకారపు సహజసిద్ధమైన జలపాతం. పాలమూరు జిల్లాలో వర్షాకాలంలో మాత్రమే జాలువారుతున్న జలపాతం మషెనోలొద్ది స్థానికులను ఆకట్టుకుంటోంది. 

తెలంగాణ నయాగరా.. 

ములుగు జిల్లాలోని బొగత జలపాతం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత అందమైన జలపాతాల్లో ఒకటి. బొగత జలపాతం చుట్టూ దట్టమైన అడవులు, పచ్చని వాతావరణం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే దీనిని తెలంగాణ నయాగరా అని పిలుస్తారు.

మేఘాల మధ్య విహారం.. 

వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి కొండలు హైదరాబాద్‌‌‌‌కి అత్యంత సమీపంలోని హిల్ స్టేషన్‌‌‌‌గా ప్రసిద్ధి చెందాయి. వర్షాకాలంలో మేఘాలు కొండలను తాకుతూ వెళ్లే దృశ్యాలు మనసును రంజింపజేస్తాయి. ట్రెక్కింగ్, క్యాంపింగ్ ప్రియులకు అనంతగిరి ఇష్టమైన ప్రదేశంగా నిలిచింది.

ఈ సీజన్​లో ఎతైన కొండలపై నుంచి జాలువారుతున్న జలపాతాల గలగలలు, పచ్చని కొండలు, సరస్సుల సోయగాలు కలిసి పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఈ వర్షాకాలంలో  ఒక రోజు సమయం కేటాయించి తెలంగాణ ప్రకృతి అందాలైన జలపాతాలను చూసి ఆస్వాదించండి.

జలపాతాల సందర్శనలో జాగ్రత్తలు

జలపాతాల సందర్శనకు వెళ్లే పర్యాటకులు జాగ్రత్తలు తీసుకోవాలని పర్యావరణ శాస్త్రవేత్త అఖిల్ సూచించారు. వాతావరణ పరిస్థితులు ముందుగానే తెలుసుకుని వెళ్లాలి. జలపాతాల దగ్గర కొండలు, గుట్టలపై జారుడు ప్రాంతాల్లో జాగ్రత్తగా నడవాలి. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడంటే అక్కడ పారేయకూడదు. రెయిన్‌‌‌‌కోట్, ఫస్ట్ ఎయిడ్ కిట్ వెంట తీసుకెళ్లాలి. ప్రమాదకర ప్రాంతాల్లో సెల్ఫీలు తీసుకోకూడదని ఆయన కోరారు.

నల్లమల అడవుల్లో మల్లెల తీర్థం

నాగర్‌‌‌‌కర్నూల్ జిల్లాలోని దట్టమైన నల్లమల అడవుల మధ్య ఉన్న మల్లెల తీర్థం వర్షాకాలంలో మరింత అందంగా మారుతుంది. స్వచ్ఛమైన నీరు 150 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతుంటే పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి కలిగిస్తుంది. ప్రకృతి ప్రేమికులు, ఫొటోగ్రాఫర్లకు ఇది స్వర్గధామంగా మారింది. నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతం ఆధ్యాత్మికత, ప్రకృతి అందాల కలయికగా నిలుస్తుంది.

లక్నవరం సరస్సులో.. ఊగే వంతెన! 

ములుగు జిల్లాలోని లక్నవరం సరస్సు ఈ వర్షాకాలంలో అత్యంత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా మారింది. సరస్సు నిండుగా నీటితో కళకళలాడుతుండగా నీటి మధ్య నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జి స్పెషల్​గా అట్రాక్ట్​ చేస్తోంది. జాలువారుతున్న జలపాతాలే కాకుండా కృష్ణానదిలో లాంచీ విహారం, నీటి మధ్యలో ఊగే వంతెన.. పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.