IND-W vs AUS-W: మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా ఇవాళ (జూన్ 28, ఆదివారం) లార్డ్స్ మైదానంలో ఆరుసార్లు ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ శిఖా పాండే జియోస్టార్ (JioStar) ఇంటర్వ్యూలో ఇండియాకు కొన్ని క్రేజీ టిప్స్ ఇచ్చింది. బంగ్లాదేశ్‌పై గెలిచిన కాంబినేషన్‌నే ఆసీస్‌తో మ్యాచ్‌లోనూ కొనసాగించాలని, జట్టులో మరిన్ని మార్పులు చేయాలనే ఆలోచనను పక్కన పెట్టాలని సూచించింది.
ఇక ప్రయోగాలు ఆపేయండి:
జట్టులో పదే పదే మార్పులు చేయడం వల్ల ప్లేయర్లలో అభద్రతాభావం పెరుగుతుందని మాజీ క్రికెటర్ శిఖా పాండే అభిప్రాయపడింది. ఫస్ట్ మ్యాచ్ నుంచి నాలుగో మ్యాచ్ వరకు వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఒకే రకమైన ఇద్దరు పేసర్ల కాంబినేషన్‌తో భారత్ ఎప్పుడూ ఆడలేదని, అంటే మనం జట్టును ఎక్కువగా మార్చేస్తున్నామని గుర్తు చేసింది. ప్లేయర్లు జట్టులో కుదురుకోవడానికి వారికి కాస్త సమయంతో పాటు స్వేచ్ఛనివ్వాలని కోరింది. బంగ్లాదేశ్‌పై మంచి విజయం సాధించాం కాబట్టి.. అదే పాజిటివ్ ఆటిట్యూడ్‌తో ఆస్ట్రేలియాపైకి వెళ్లాలని టీమ్ మేనేజ్‌మెంట్‌ను కోరింది.
ఎల్లీస్ పెర్రీకి చెక్ పెట్టాలంటే శ్రీ చరణి బెస్ట్:
ఆస్ట్రేలియా ఇన్-ఫామ్ ఆల్‌రౌండర్ ఎల్లీస్ పెర్రీ ఆటతీరును శిఖా పాండే తెగ మెచ్చుకుంది. పెర్రీ కేవలం బ్యాటింగ్‌తోనే కాకుండా, బౌలింగ్‌కు వచ్చిన రెండు సార్లూ వికెట్లు తీసిందని చెప్పింది. పాకిస్థాన్‌పై ఆమె ఆడిన షార్ట్ పిచ్ షాట్లు, ఆమె కొత్తగా నేర్చుకున్న స్కూప్ షాట్ అద్భుతమని కొనియాడింది. బంతిని లేట్‌గా సీమ్, స్వింగ్ చేయగల బౌలర్ మాత్రమే పెర్రీని ఇబ్బంది పెట్టగలరని శిఖా చెప్పింది. ఈ ఏడాది ఆరంభంలో అరుంధతి రెడ్డి ఆ పని చేసినప్పటికీ, ప్రస్తుత ఫామ్ ప్రకారం ఆమె ఈ మ్యాచ్ ఆడే అవకాశం లేకపోవచ్చని.. అందుకే పెర్రీని కట్టడి చేయడానికి ప్రస్తుతం సూపర్‌గా బౌలింగ్ చేస్తున్న శ్రీ చరణి బెస్ట్ ఆప్షన్ అని శిఖా పాండే వెల్లడించింది.
షఫాలీ వర్మ వర్సెస్ ఆసీస్ బౌలర్లు:
టీమిండియా డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ, ఆస్ట్రేలియా బౌలర్ల మధ్య గట్టి ఫైట్ నడవనుందని శిఖా పాండే తెలిపింది. ఆసీస్ బౌలర్లు కిమ్ గార్త్, సోఫీ మోలినెక్స్‌లతో పాటు ఒకవేళ యువ లెఫ్ట్ ఆర్మ్ మీడియం పేసర్ లూసీ హామిల్టన్‌ను గనుక జట్టులోకి తెస్తే.. ఆమె షఫాలీ బలహీనతను టార్గెట్ చేస్తూ షార్ట్ పిచ్ డెలివరీలు వేసే ఛాన్స్ ఉంటుంది.. అయితే షఫాలీ ప్రస్తుతం క్లీన్ షాట్లతో మంచి ఫామ్‌లో కనిపిస్తుంది.. సోఫీ మోలినెక్స్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌ను ఎదుర్కొనేటప్పుడు కేవలం స్ట్రెయిట్‌గా అంటే 'V' షేప్‌లో ఆడితే ఎలాంటి ఇబ్బంది ఉండదని, పాకిస్తాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌ల్లో ఆమె స్పిన్నర్లను బాగానే ఎదుర్కొందని శిఖా చెప్పుకొచ్చింది.
