దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యం

దుబ్బాక ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యం

దుబ్బాక ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమ‌ని, ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ గెలిచితీరాలని అన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్. అత్యవసర పరిస్థితి మినహా కాంగ్రెస్‌ నేతలందరూ దుబ్బాకలోనే ఉండాలని ఆ పార్టీ నేతలను ఆదేశించారు, నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోమ‌ని హెచ్చ‌రించారు. దుబ్బాక ఉప ఎన్నికపై ఆదివారం గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ ముఖ్యనేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఠాగూర్ మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నిక అనేది అభ్యర్థి పోరు కాదని, పార్టీ పోరు అని అన్నారు. హస్తం గుర్తు తో ముందుకు వెళ్ళాలని, ఇప్పుడు కష్టపడితే 2023లో ప్రభుత్వం మనదేన‌ని కాంగ్రెస్ ముఖ్య నేత‌ల‌తో అన్నారు.

వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా వినతిపత్రం ఇస్తామంటే గవర్నర్‌ తమిళసై సమయం ఇవ్వలేదని, గవర్నర్ తీరు బాధాకరమన్నారు. గవర్నర్‌కు ఈ మెయిల్ చేసినా రిప్లయ్ రాలేదని తప్పుబట్టారు. హాథ్రస్‌ ఘటనకు నిరసనగా సోమవారం సత్యాగ్రహ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించారు. పీసీసీ చీఫ్‌, మెదక్ జిల్లా నేతలతో చర్చించాక దుబ్బాక అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. దుబ్బాకలో యువనేతలతో టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని, నేతలు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు కష్టపడితే 2023లో ప్రభుత్వం తమదేనని మాణికం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు.